దలైలామాకు మాత్రమే ఆ హక్కుంది.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

దలైలామా వారసుడిని తమ అనుమతితోనే ఎంపిక చేయాలన్న చైనా ప్రకటనపై భారత్ స్పందించింది. దీనిపై డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే 15వ దలైలామా ఎంపికలో చైనా జోక్యం ఉండదని.. చైనా అవతల జన్మించిన వ్యక్తే తన వారసుడు అవుతాడని దలైలామా ప్రకటించారు. ఇప్పుడు భారత్ కూడా చైనాకు కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

బౌద్ధ మత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన వారసుడిని ఎంపిక చేసే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని.. ఇతరులకు ఆ హక్కు లేదని దలైలామ స్పష్టం చేశారు. దీంతో బీజింగ్ కోపం కట్టలు తెంచుకుంది. తమ ఆమోదముద్ర లేకుండా దలైలామ వారసుడిని ఎంపిక చేయకూడదని తెలిపింది. అంతేకాకుండా తమ చట్టాలకు అనుగుణంగా, చైనాలోనే ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పింది. చైనా వ్యాఖ్యలను దలైలామ తిప్పికొట్టారు. చైనా జోక్యాన్ని ఒప్పుకునేదే లేదని స్పష్టం చేశారు. చైనా అవతల జన్మించిన వ్యక్తే తన వారసుడు అవుతాడని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై భారత్ స్పందించింది. దలైలామా పునర్జన్మను బీజింగ్ ఆమోదించాలని చైనా చేసిన డిమాండ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప మరెవరికీ తన వారసుడిని నిర్ణయించే అధికారం లేదని స్పష్టం చేసింది.

దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆయన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకు మాత్రమే ఉందని నొక్కి చెప్పారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు రిజిజు, జేడీయూ నాయకుడు లాల సింగ్ భారత ప్రభుత్వ ప్రతినిధులుగా ధర్మశాలకు వెళ్తున్నారు. అయితే ఇది పూర్తిగా మతపరమైన సందర్భం.. దీనిపై ఎటువంటి రాజకీయాలు చేయకూడదని రిజిజు అన్నారు.

1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన తిరుగుబాటు విఫలమైన తర్వాత దలైలామా లాసా నుంచి వచ్చి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి చైనా దలైలామాను వేర్పాటువాది అని ముద్ర వేస్తూ వస్తోంది. టిబెటన్లు మాత్రం దలైలామాను అహింస, కరుణ, తమ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చిహ్నంగా అభివర్ణిస్తారు. మొన్నటివరకు చైనా సొంతంగా దలైలామాను నియమిస్తుందనే భయాందోళనను టిబెటన్లను వెంటాడింది. బుధవారం దలైలామా ప్రకటనతో ఆ ఆందోళన వీడినా.. చైనా ఎటువంటి కుట్రలు చేస్తోందోననే కొత్త భయం మొదలైంది.

About Kadam

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *