హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్న ఓ నివాసంలో గురువారం ఉదయం రిఫ్రిజియేటర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో సిలిండర్ పేలడం, రిప్రిజియేటర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఉదయం ఒక్కసారిగా రిఫ్రిజియేటర్ పేలిపోయింది. ఈ పేలుడు కారణంగా మంటలు సంభవించి ఇళ్లు మొత్తం వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఇక ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా ఫైర్ సిబ్బంది. మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం మంటల్లో కాలిబూడిదైపోంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిద కావడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటోంది.
ఇక అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.