రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగాయి. దాదాపు అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఇప్పటికే ఆన్సర్ కీలు కూడా విడుదలైనాయి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి జూలై 2 వరకు ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 92.90 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. పరీక్షల చివరి రోజు బుధవారం (జులై 2) రెండు సెషన్లలో ఎస్జీటీ తెలుగు, మైనర్ మీడియా పోస్టులకు రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 19,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 19,409 మంది అంటే 97.06 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇక డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా ఆగస్టు రెండో వారంలో డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే విడతల వారీగా ఆయా పోస్టులకు ప్రాథమిక ఆన్సర్ కీ, రెస్పాన్స్‌షీట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మిగతావి కూడా రెండు మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలకు వారం రోజులపాటు గడువు ఇస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత తుది ఆన్సర్ కీలను విడుదల చేయనున్నారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల్లోపు డీఎస్సీ మెరిట్ లిస్టులు ప్రకటిస్తారు. ఈ క్రమంలో జులై 3వ తేదీ నుంచి అభ్యర్ధుల సందేహాల నివృతి కోసం 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్‌లైన్ నంబర్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాగా ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అన్ని పోస్టులకు దాదాపు 3,36,307 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరంతా దాదాపు 5,77,417 అప్లికేషన్లు సమర్పించారు. అర్హతలకు అనుగుణంగా అనేక మంది ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలను నిర్వహించారు. డీఎస్సీ ఫలితాల్లో టెట్ స్కోర్ కీలకంగా మారనున్నాయి. పైగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు కాబట్టి నార్మలైజేషన్ కూడా ఉండనుంది. ఈ రెండింటి ఆధారంగా తుది ర్యాంకు ప్రకటిస్తారు. దీంతో అభ్యర్ధుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.