2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు జూన్ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు జూన్ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రకటన విడుదల చేశారు. తాజా ప్రకటన మేరకు జులై 31 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలు పొందేందుకు ఇంటర్ బోర్డు విద్యార్ధులకు అవకాశం ఇచ్చింది. కొన్ని కళాశాలల అభ్యర్థన మేరకు ప్రవేశాల గడువును పొడిగించినట్లు తెలిపింది. పైగా పదో తరగతిలో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి మొత్తం 5,92,602 మంది ఉత్తీర్ణత సాధించగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌లో 4.90 లక్షల మంది మాత్రమే చేరారు. మరికొంత మంది ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతరత్రా కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. అర్హులైన విద్యార్ధులు వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా సూచించారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ జూనియర్ కాలేజీలకు మొత్తం 314 పని దినాలు, 79 రోజులు సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ షెడ్యూల్ ప్రకారం జూన్ 2 నుంచే జూనియర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు జరుగుతుండగా.. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం తరగతులు కొనసాగుతున్నాయి.
జులై 6 నుంచి ఏపీ డీఈఈసెట్ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ డీఈఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 6 నుంచి కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్‌ను జులై 6, 7 తేదీల్లో సిద్ధం చేయనున్నారు. జులై 8 నుంచి 12 వరకు వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం కల్పిస్తారు. జులై 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్ల జారీ కొనసాగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన 17 నుంచి 22 వరకు ఉంటుంది. ఇక జులై 25 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.