పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ రక్షణ సాంకేతికతలపై ఆసక్తిని వ్యక్తం చేసింది. బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధభూమి సాంకేతికత, జలాంతర్గాములు, తీర రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఉగ్రవాదలుపై దాడికి ప్రతిదాడిగా భారత్‌పై పాకిస్థాన్ దాడులకు ప్రయత్నించింది. కానీ, పాక్ దాడులను తిప్పి కొడుతూ తమ ఆర్మీ పవరేంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది భారత్. దీంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచం చూపు ఇండియాపై పడింది. దీంతో ఇండియా వద్ద ఉన్న ఆయుధాలు తమకు కూడా కావాలంటూ చాలా దేశాలు ఆసక్తి చూపించాయి. ఆ వరుసలో ఇప్పుడు బ్రెజిల్ కూడా చేరింది.
భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్‌ను కొనుగోలు చేయడానికి బ్రెజిల్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇది భారతదేశ రక్షణ ఎగుమతికి పెద్ద ప్రోత్సాహకంగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దళాలు సైనిక, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలోకి సాయుధ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినప్పుడు.. వాటిని ఎస్ 400తో పాటు ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా అడ్డుకున్నాయి. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, స్కార్పీన్-క్లాస్ జలాంతర్గాములు వంటి భారతదేశంలో తయారు చేసిన సైనిక హార్డ్‌వేర్‌పై బ్రెజిల్ ఆసక్తిని అధికారికంగా ధృవీకరించింది. ఈ వారం చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాటిన్ అమెరికన్ దేశాన్ని సందర్శించినప్పుడు ఇది జరిగింది.
జూలై 5 నుండి 8 వరకు రియో డి జనీరోలో జరిగే 17వ బ్రిక్స్ సమ్మిట్ కోసం బ్రెజిల్ సహా ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లారు. అర్జెంటీనాతో సహా మరికొన్ని లాటిన్ అమెరికన్ దేశాలను సందర్శించారు. బ్రెజిల్ నాయకత్వంతో మోదీ చర్చల సందర్భంగా రక్షణ సహకారం కీలకమైన ఎజెండాగా ఉంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (తూర్పు) పీ.కుమరన్ వెల్లడించారు. “రక్షణ సహకారం, ఉమ్మడి పరిశోధన, శిక్షణకు మార్గాలు గురించి చర్చ జరగబోతోంది” అని కుమరన్ జూలై 2న తెలిపారు. బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధభూమిలో సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌకలు, వారి స్కార్పీన్-క్లాస్ జలాంతర్గాములను నిర్వహించడానికి భాగస్వామ్యం, ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థ, తీర నిఘా వ్యవస్థ, గరుడ ఫిరంగి తుపాకులపై ఆసక్తి కలిగి ఉందని కుమరన్ పేర్కొన్నారు.
పాక్‌కు వ్యతిరేకంగా సూపర్ సక్సెస్..
భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, మే నెలలో ఆపరేషన్ సిందూర్ సమయంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ సైనిక దాడి జరిపింది. ఆ తర్వాత పాక్.. భారత్ లోని శ్రీనగర్ నుండి గుజరాత్‌లోని భుజ్ వరకు డజన్ల కొద్దీ భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకుని చైనా, టర్కీ నిర్మిత డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి చేసిన ప్రతిదాడులను భాతర బహుళ-అంచెల వైమానిక రక్షణ నెట్‌వర్క్ విజయవంతంగా అడ్డుకుంది. భారతదేశపు AI-ఆధారిత ఆకాష్‌టీర్ వ్యవస్థలో అంతర్భాగమైన ఆకాష్ వ్యవస్థ, భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కౌంటర్-UAS గ్రిడ్ (IACCS) వైమానిక రక్షణ వ్యవస్థలు ప్రతి ముప్పును 100 శాతం కచ్చితత్వంతో అడ్డుకున్నాయి.