ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న స్వయం సహాయక మహిళా గ్రూప్ (SHGs) స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రో ఫైనాన్స్, రూరల్ డెవెలప్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నివాసితులై ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఈ అర్హతలున్నవారు జులై 18, 2025వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 7, 2025వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1,000 చెల్లించవల్సి ఉంటుంది. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు కూడా అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుంచి రూ.30,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.