యోగాను విశ్వవ్యాప్తం చేసి.. ప్రపంచ దేశాలు భారత వైపు చూసేలా చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు యోగాను జీవితంలో భాగం చేసి విశాఖ వేదికగా మరో రికార్డు సృష్టించబోతున్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రికార్డు నెలకొల్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ.. విశాఖకు చెందిన కళాకారుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రధాని మోదీ మెచ్చిన యోగాతో పాటు.. ప్రధాని నచ్చిన ఆహారమైన చిరుధాన్యాలతో చిత్ర పటాలను వేశాడు. అదీ కూడా మోదీ యోగాసనాలతో అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించాడు. కలర్స్‌తో కాకుండా కేవలం మిల్లెట్స్‌తోనే చిత్ర కళా రూపాలకు జీవం పోసి ఔరా అనిపించాడు.
విశాఖకు చెందిన మోకా విజయ్ కుమార్ ప్రపంచ ప్రసిద్ధ చిరు ధాన్యాల చిత్రకారుడు. సందర్భానికి అనుగుణంగా భారతీయ ఆహార ధాన్యమైన మిల్లెట్స్ ను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ గుర్తింపు తీసుకొస్తున్నాడు. మోదీ మెచ్చిన చిరు ధాన్యాలను తన కళతో విశ్వవ్యాప్తం చేస్తున్నాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసి పదేళ్లు పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా యోగ దినోత్సవ వేడుకలు ఏటా జరుపుకుంటుంది. 11వ ఏట విశాఖ వేదికగా మరో రికార్డును సృష్టించబోతున్న నేపథ్యంలో.. మోదీ మెచ్చిన చిరుధాన్యాలతో.. ప్రధానికి నచ్చిన యోగాను ప్రత్యేకంగా తనదైన శైలిలో ఆవిష్కరించాడు విజయ్ కుమార్. మోదీ యోగాసనాలు చేసేలా చక్కగా అభివర్ణిస్తూ చిత్రాలు రూపొందించాడు. చిరుధాన్యాలతో ఎంతో చక్కగా.. మోదీ యోగాసనాలు వేస్తున్నట్టు 8 అద్భుత చిత్రాల తో ఓ ఫ్రేమ్ రూపొందించాడు.
మిల్లెట్స్ తో నేచురల్‌గా.. తదేకంగా చూస్తేనే గాని..
ప్రపంచ యోగా దినోత్సవ లోగోను కూడా అందంగా తీర్చిదిద్దాడు. సుఖాసనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగ తో ఉన్నట్టుగా ప్రధాన చిత్రాన్ని రూపొందించాడు. చుట్టూ మరిన్ని యోగాసనాలు చేస్తున్నట్టు చిత్రాలు మిల్లెట్స్ తో ఆవిష్కరించాడు మోకా విజయ్ కుమార్. వృశ్చికసనం, ఏకపాదాసనం, ధనురాసనం.. ఇలా ఒక్కొక్క చిత్రం ఆశ్చర్యం కలిగించేలా తీర్చిదిద్దాడు. ఆ చిత్రాలు ఎంతలా ఉన్నాయంటే తదేకంగా చూస్తే గాని.. చిరు ధాన్యాలతో రూపొందించిన చిత్రమా అని ఔరా అనక మానరు.
స్కిన్ టోన్‌కు తగ్గట్టుగా మిల్లెట్స్ ఎంచుకుని..
45 రోజులపాటు శ్రమించి, ఈ చిత్రాన్ని రూపొందించాడు విజయ్ కుమార్. కొర్రలు, సామలు, నల్ల సామలు, రాగులు అరికెలు ఐదు రకాల మిల్లెట్స్‌ను ఈ చిత్రాల కోసం వినియోగించాడు. ప్రధానమంత్రి స్కిన్ టోన్ కు తగ్గట్టుగా మిల్లెట్స్ ను జత చేస్తూ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించాడు. చిరు ధాన్యాలు అంటే మిల్లెట్స్ తో రూపొందించిన ఈ చిత్రాలను తదేకంగా చూస్తే గానీ నమ్మలేరు. ఈ చిత్రల కోసం రక రకాల మిల్లెట్స్ ను వినియోగించారు మోకా విజయ్ కుమార్. స్కిన్ టోన్, ఆర్ట్ షేడ్ కు అనుగుణంగా అరికెలు, కొర్రలు, సామలు నల్ల సామలు, అంటు కొర్రలతో నేచురల్ కలరీంగ్ చేశారు. దగ్గర నుంచి చూస్తే గాని.. ఆ చిత్రం చిరుధాన్యాలతో చేసినట్టు అనిపించదు. ఎందుకంటే అంతలా తన ప్రతిభ అంతటినీ జోడించి కళారూపానికి జీవం పోశాడు. మిల్లెట్స్ తో రూపొందించిన ఈ కళారూపాలను చూసి ఔరా అంటున్నారు సందర్శకులు.
మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆహార దాన్యాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కి చిరుధాన్యాలతో తయారుచేసిన ఈ చిత్రపటాలను ప్రభుత్వం తరఫున ఇవ్వాలనే ఆశతో ఉన్నానని అంటున్నాడు. ఈ చిత్రాన్ని బహుకరిమిచేదుకు అవకాశం కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కానుకగా ప్రభుత్వం తరఫున పంపిస్తానంటున్నాడు.
హెల్త్ ఆర్ట్ పేరుతో అద్భుతాలు..
విశాఖకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్.. రైల్వే ఉద్యోగి. కానీ కళలపై మక్కువతో చిరుధాన్యాలతో కళారూపాలు చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే హెల్త్ ఆర్ట్ పేరుతో ప్రముఖుల చిత్రాలు, సామాజిక స్పృహను కలిగించే కళారూపాలు చేశారు. చిరుధాన్యాల ప్రాముఖ్యత చిత్రకళ రూపంలో ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాడు. అది కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయ ఆహారంలో భాగమైన చిరుధాన్యాలతో.
వేల చిత్రాలు వేసి.. ప్రశంసలు అందుకొని..
ప్రముఖుల చిత్రపటాలతో పాటు.. చక్కని సందేశాన్ని ఇచ్చేలా మిల్లెట్స్ తో చిత్రాలు రూపొందించడం విజయకుమార్ హాబీ. ఇందులో భాగంగా వందల సంఖ్యలో చిత్రాలు రూపొందించాడు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటం తో పాటు.. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణస్వీకారం వేల అతని జీవిత చరిత్ర ప్రతిబింబించేలా ప్రత్యేక చిత్రాలు వేశాడు. తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు దంపతుల చిత్రాన్ని కూడా మిల్లెట్స్ తో వేసి ఔరా అనిపించాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు జీవిత చరిత్ర చిత్రపటాలు కూడా చిరుధాన్యాలతో వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.