సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు చేసి సంవత్సరం అయినా సందర్భంగా మొదటి సంవత్సర యానివర్సరీ అంటూ కేక్ తయారు చేసి కలెక్టరు కార్యాలయంలోనే కేక్ కట్ చేసేందుకు వచ్చిన బాధితుడిని చూసి అధికారులు షాక్ అయ్యారు.

ఆక్రమణలు తొలగించి ముంపు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏడాది క్రితం అర్జీ అందించారు. మళ్లీ పలుసార్లు అర్జీలు ఇచ్చినా పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు ఆ అర్జీలను పరిష్కరించినట్టు చూపుతూ క్లోజ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి సైతం ఇదేవిధంగా చేయడంతో ఆవేదన చెందిన బాధితుడు అందరూ అవాక్కయ్యే పని చేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన తెలుగు యువత మండల శాఖ అధ్యక్షుడు కోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినూత్నంగా ఏడాది కాలమైనా అర్జీని పరిష్కరించలేదని చెబుతూ ‘పిటీషన్ ఫస్ట్ యానివర్శరీ’ పేరిట కేకు సిద్ధం చేసి పంచాయతీ అధికారులతో కట్ చేయించేందుకు తీసుకువచ్చాడు. అప్పటికే సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రీవెన్స్‌లో కేక్ తీసుకువచ్చిన వారిని గుర్తించారు. కేకుతోపాటు రావులపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని బయటికి తీసుకువచ్చారు. చంద్రశేఖర్ మరోసారి అర్జీని అందించి బయటకి వచ్చి తమ గోడును వివరించారు.

గతేడాది ఇదే డిసెంబరు నెలలో రావులపాడులోని దుర్గావతి ఆస్పత్రి వీధిలో ఉన్న ఆక్రమణలు తొలగించి ముంపునీటి సమస్యను పరిష్కరించాలని అర్జీ అందించామన్నారు. అప్పట్లో పంచాయతీ కార్యదర్శి ఎం.సాయిపట్టాభి రామయ్య విచారణ జరిపి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణలు తొలగించని పక్షంలో పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పట్లో ఇచ్చిన అర్జీ మేరకు తనను కలుసుకున్న పంచాయతీ కార్యదర్శి నెల రోజుల వ్యవధి ఇవ్వాలని కోరారు. ఆ మేరకు లిఖిత పూర్వక లేఖను సైతం అందజేశారు. ఏడాది పూర్తి అవుతున్నా ఇంతవరకు ఆక్రమణలు తొలగించలేదన్నారు. ఈనెల 2న చంద్రశేఖర్ మరోసారి కలెక్టరేట్లో అర్జీ అందించారు. అయినా ఇప్పటికి సమస్య పరిష్కరం కాలేదు. అర్జీదారుని సంప్రదించకుండానే సమస్య పరిష్కరించినటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిన తీరును ఆయన తప్పుబట్టారు. సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే కోర్టును ఆశ్రస్తామని చంద్రశేఖర్, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రెహ్మతుల్లా షరీఫ్ పేర్కొన్నారు.

About Kadam

Check Also

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోకపోవడంతో భర్త ఏం చేశాడంటే..?

ప్రియుడితో భార్య యవ్వారం నడుపుతుందని తెలిసిన ఓ భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందలించిన భార్య బుద్ధి మారకపోవడంతో నీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *