తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
అయితే కొద్ది రోజులపాటు సెలవు నిమిత్తం అరవింద్ కుమార్ విదేశాలకు వెళ్లారు. జూన్ 30వ తేదీన అరవింద్ కుమార్ సెలవు గడువు ముగుస్తుంది. తిరిగి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో జూలై 1న తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా తాజాగా ఐఏఎస్ అరవింద్ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో డ్రాఫ్టింగ్ దగ్గర నుండి అన్ని తానై, అరవింద్ కుమార్ వ్యవహరించారు. ఇప్పటి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రెండుసార్లు విచారించిన ఏసీబీ, కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరోసారి అరవింద్ కుమార్ ను విచారించాలని నిర్ణయించింది. గత విచారణలో భాగంగా అగ్రిమెంట్ల వ్యవహారం అంతా అప్పటి అధికారులు చూసుకున్నారని కేటీఆర్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న అరవింద్ కుమార్‌ను ఏసీబీ విచారణకు పిలవడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో అరవింద్ కుమార్ కనిపించటం లేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ప్రభుత్వ అనుమతితోనే విదేశాలకు వెళ్లినట్లు ఒక జీవో సైతం బయటికి వచ్చింది. దాని ప్రకారం జూన్ 30 వరకు అరవింద్ కుమార్ సెలవుల్లో ఉండగా జూలై ఒకటో తారీఖున ఆయన విచారణకి హాజరుకానున్నారు. కాగా, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను నిందితుడుగా ఏసీబీ చేర్చింది. అటు ఏసీబీ తోపాటు ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు సైతం అరవింద్ కుమార్ హాజరయ్యారు.
Amaravati News Navyandhra First Digital News Portal