ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ దృవపత్రాల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ దృవీకరణ పత్రాలు సృష్టించి కేంద్ర భద్రత బలగాల్లో ఉద్యోగాలు సాదించేందుకు సహకరించిన ముఠాను రిమాండ్ కు తరలించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఏకంగా కేంద్ర భద్రతా బలగాల్లో ఉద్యోగాలు పొందిన 9 మందిపై కేసు నమోదు చేశారు. మూడు నెలల విచారణ అనంతరం ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేయడంతో ఇచ్చోడ మీ సేవ సెంటర్ల స్కాం మరోసారి తెర పైకి వచ్చింది.
భద్రత బలగాల్లో జనరల్ డ్యూటీ(జీడీ) కానిస్టేబుళ్ల భర్తీకోసం 2023 డిసెంబరులో నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, గిరిజనుల సంఖ్య అధికం కావడంతో పోటీ తక్కువగా ఉంటుందని ఉత్తరాదికి చెందిన ముఠాలు ఈ ప్రాంతంపై దృష్టిపెట్టాయి. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్‌కు చెందిన మాజీ సర్పంచి షేక్ ఫరీద్(59)ను సంప్రదించి స్థానిక ధ్రువపత్రాలు ఇప్పిస్తే రూ. లక్షల్లో ముట్టచెబుతామని ఆశ చూపాయి. అందుకు తగ్గట్టుగానే ముందుగానే ఓ లక్ష రూపాయలను నకిలీ ఆధార్ సృష్టించేందుకు ముట్ట చెప్పింది ఉత్తరాది ముఠా. ముఠాతో ఒప్పందం చేసుకున్న మాజీ సర్పంచ్ ఫరీద్.. ఇచ్చోడకు చెందిన షేక్ కలీం(34) అనే వ్యక్తి సహకారం తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ చెందిన 9 మంది యువకులు వీరి సాయంతో స్థానికత ఆధారంగా ఆదార్ , రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ సంపాదించుకున్నారు. అలా ఆదిలాబాద్ జిల్లా కోటాలో కేంద్ర భద్రత బలగాల్లో 2024లో ఉద్యోగం సాధించి ట్రైనింగ్ లో చేరారు. ఈ క్రమంలో వారి ధ్రువపత్రాలు కేంద్రం నుంచి జిల్లా స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులకు పరిశీలనకు రావడం.. ఎస్బీ పరీశీలనలో అసలు అలాంటి యువకులెవరు ఈ ప్రాంతంలో లేరని తేలడంతో నకిలీ ధ్రువపత్రాల బాగోతం బయటకు పొక్కింది. గతంలో ఇదే ప్రాంతంలో మీ సేవ కేంద్రాల ముసుగులో భారీ కళ్యాణ లక్ష్మి స్కాం జరగడంతో ఫోకస్ పెట్టిన టీవి9.. ఇస్లాంనగర్ నకిలీ దృవపత్రాల బండారాన్ని బయటపెట్టింది.
ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ జీపీ పరిదిలోని కోకస్ మన్నూర్ అడ్రస్‌తో 14 మంది ఆర్మీలో ఉద్యోగాలు సాదించారని గత ఏప్రిల్‌లో ఆదారలతో సహా కథనాలు ప్రసారం చేసింది టీవి9. టీవి9 కథనాలతో అలర్ట్ అయిన పోలీసులు ఆరా తీయడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ చిరునామాతో మహ్మద్ రాజాసిద్ధిఖీ పేరిట ఓ ఆదార్ కార్డ్ ఇష్యూ అయింది. తీరా ఆ ఆదార్ కార్డ్ నకిలీదని తేలడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలోని నివాస ధ్రువపత్రాలతో దరఖాస్తులు చేసుకున్న తీరు పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు తేలింది. ధ్రువపత్రాలు పొందేందుకు ఒక్క ఇచ్చోడ మండలం నుంచే 100 మంది 181 సార్లు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా బీహార్ , మద్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలయితే నివాసం మాత్రం ఇస్లాంనగర్ అడ్రస్‌తో ఉండటంతో షాక్ అవడం పోలీసుల వంతైంది. తీగ లాగితే డొంకంత కదిలినట్టు.. ఇస్లాంనగర్ నుండి ఆదార్ అడ్రస్ మార్పు కోసం వచ్చిన అప్లికేషన్లు అన్నీ నకిలివనీ గుర్తించిన రెవెన్యూ అదికారులు ఏకంగా 180 కి పైగా అడ్రస్ మార్పు అప్లికేషన్ల ను రద్దు చేయడం మరింత సంచలనంగా మారింది.
బిపిన్ యాదవ్, అతుల్ కుమార్ యాదవ్, రాజ్ కుమార్ పటేల్, అంకిత్ పటేల్, జైనూల్ అబ్దిన్ ఖాన్, దీపక్ కుమార్ పటేల్, మహారాజ్ అన్షారీ, అసర్ ఖాన్, వినయ్ వర్మ, నాగేంద్ర యాదవ్, అభిద్ ఖాన్, సుబాన్ దుభే, కుల్దీప్ తివారీ ఇలా 14 మంది ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ జీపి నుండి కోకస్ మన్నూర్ గ్రామ నివాస దృవీకరణ సంపాదించి నాన్ లోకల్ కోటాలో బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు సాదించినట్టు తేలింది. తీరా వీరి అడ్రస్ లో ఆరా తీయగా అలాంటి వ్యక్తులెవరు ఆ ప్రాంతాల్లో లేరని తేలింది. పుట్టింది పెరిగింది చివరికి చదివింది కూడా పక్కా రాష్ట్రాల్లోనే అయినా తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ నుండే నివాస దృవీకరణ పత్రం సంపాదించడం తో నకిలీదృవికరణ పత్రాలతో ఏకంగా దేశ భద్రతను కాపాడే ఆర్మీలో చేరడంతో ఇందులో 9 మంది పై కేసులు నమోదు చేశారు ఆదిలాబాద్ పోలీసులు.
నకిలీ పత్రాలు పొందెందుకు వీరికి సహకరించిన ఇస్లాంనగర్‌కు చెందిన షేక్ కలీం(34) , షేక్ ఫరీద్ (59) , జాదవ్ గజానంద్(35) లను అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్న ఈ ముగ్గురు ఉత్తర భారతానికి చెందిన 9 మందికి నకిలి దృవీకరణ పత్రాలు దొడ్డి దారిలో సృష్టించి ఇచ్చినట్టు తేలింది. మొదట ఆధార్ కార్డు కోసం దీపక్ తివారీ అనే యువకుడు నివాసా ధ్రువీకరణ పత్రం కోసం ట్రై చేసి విఫలమవడంతో ఇస్లాంనగర్ మాజీ సర్పంచ్ భర్త – షేక్ ఫరీద్, షేక్ ఖలీం కలిసి, పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి, మీ సేవలో అప్లై చేసి తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందారు. అలా తప్పుడు దృవీకరణ పత్రాలతో దీపక్ తివారీ ఉద్యోగంలో చేరడంతో అదే బాటలో మరో 8 మంది సైతం ఇచ్చోడ మీ సేవ ద్వారా నకిలీ దృవీకరణ పత్రాలు పొందారని తేలింది. తప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డులు సృష్టించేందుకు ఆ 9 మంది నుండి రూ. 9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న ఇస్లాంనగర్ కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠా అభ్యర్థుల నుండి రూ. 3 లక్షలు తీసుకోగా.. మిగిలిన 6 లక్షలు ఉత్తర ప్రదేశ్‌లోని హుర్లిక్ అనే వ్యక్తి వద్ద మద్య వర్తిగా ఉంచినట్టు పోలీసులు తేల్చారు.
అయితే ఈ కేసులో ఇచ్చోడ మండలంలో నాలుగు నెలల కాలంలోనే 185 కు పైగా ఆదార్ అడ్రస్ మార్పుల దరఖాస్తులను గుర్తించిన అదికారులు.. వాటిన్నింటిని గతంలో రద్దు చేశారు. గతంలో ఇక్కడ పని చేసిన నాయిబ్ తహసీల్దార్ జే. రామరావు అనే అధికారి సంతకాలతోనే వందల సంఖ్యలో అడ్రస్ మార్పు దరఖాస్తులు వచ్చినట్టుగా గత ఏప్రిల్ గుర్తించినా ఎలాంటి పోలీసు ఫిర్యాదు ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేశ రక్షణకు మూల స్తంబంగా ఉండే ఆర్మీ లాంటి ఉద్యోగాల్లో చేరే యువత ఇలా నకిలీ దృవికరణ పత్రాలతో ఉద్యోగం సాదిస్తే.. ఇంకా దేశభద్రతను ఎలా కాపాడ గలుగుతారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఈ ముగ్గురిదే కీలక పాత్రన లేక అదికారుల హస్తం ఉందా అన్నది తేలాల్సి ఉంది.