నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ జల సవ్వడి…క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల..ఎన్ని గేట్లు ఎత్తారంటే..

నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ ఉరకలేస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కృష్ణా పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ జలకల సంతరించుకుంది. దీంతో 26 క్రస్ట్ గేట్ల మీదుగాకృష్ణమ్మ జాలువారుతోంది. కృష్ణవేణి జల సవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా…?

ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్ లోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే నిండాయి. జూలైలో ముందస్తుగా ఆల్మట్టి నుండి శ్రీశైలం వరకు అన్ని జలాశయాలు నిండాయి. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ గణనీయంగా నీటిమట్టం పెరిగి నిండు కుండను తలపిస్తోంది. నాగార్జునసాగర్ వద్ద 26 క్రస్ట్ గేట్ల మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 588 అడుగులకు చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన సాగర్ జలాశయంలో ప్రస్తుతం 307 టీఎంసీల మీరు నిలువ ఉంది. శ్రీశైలం నుండి మూడు లక్షల పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్ నుండి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పర్యాటకులను కనువిందు చేయనున్న కృష్ణమ్మ పరవళ్ళు..

సాగర్ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సాగర్ కు తరలి వస్తున్నారు. క్రస్ట్ గేట్ల మీదుగా జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకుల తాకిడి ప్రారంభమైంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్ళును చూసేందుకు టూరిస్టులు నాగార్జున సాగర్ కు క్యూ కడుతున్నారు. నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు. క్రస్ట్ గేట్ల మీదుగా పాల నూరుగువలే జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగుతూ పర్యాటకులు సందడి చేస్తున్నారు.

18 ఏళ్ల తర్వాత జులైలో తెరుచుకున్న గేట్లు..

తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న నాగార్జునసాగర్‌ జలాశయం18 ఏళ్ళ తర్వాత జులై నెలలో క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా కృష్ణ బేసిన్ లో జులై నుండి అక్టోబర్ వరకు భారీగా వరద నీరు వస్తుంటుంది. ఆగస్టులో సాగర్ నిండుతూ ఉండేది. ఈసారి మహరాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాల వల్ల సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కానీ ఈసారి ముందస్తుగా జులైలోనే కృష్ణ బేసిన్ కు వరదనీరు వచ్చి చేరింది. గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 18 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ తొలిసారి చాలా ముందుగానే నిండింది. సాగర్‌ గేట్లు మీదుగా కృష్ణమ్మ పులిచింతల వైపు పరుగులు పెడుతోంది. ఈ ఏడాది ముందస్తుగా కృష్ణానదికి భారీగా వరద రావడం.. ప్రాజెక్టుకు పూర్తి జలకళ రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

About Kadam

Check Also

పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!

సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *