ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) ప్రత్యేక వెబ్‌సైట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. crda.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘‘డొనేట్ ఫర్ అమరావతి’’ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు నేరుగా విరాళాలు అందజేసే వీలును కల్పించింది.

వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల ప్రాసెస్

వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రజలు తమకు వీలైన మేర విరాళాన్ని అందజేయవచ్చు. మొత్తం లావాదేవీ పూర్తిగా డిజిటల్‌గా, పారదర్శకంగా సాగనుంది. ఈ ప్రక్రియలో చెల్లించిన మొత్తం నేరుగా సీఆర్డీఏ ఖాతాలోకి జమవుతుంది.

‘మై బ్రిక్ మై అమరావతి’ గుర్తుందా..?

అమరావతి నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఇదే తొలి అడుగు కాదు. 2015 అక్టోబరులో అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘‘మై బ్రిక్ మై అమరావతి’’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఒక్కో ఇటుక రూ.10 చొప్పున ప్రజలు కొనుగోలు చేసి తమ మద్దతు తెలిపిన సందర్భం గుర్తుండే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. కొందరు ఒక్కొక్కరు 10 వేల ఇటుకల విలువైన విరాళాలు అందించారు. దాతలకు ముఖ్యమంత్రి సంతకం చేసిన రసీదు జారీ చేశారు.

ప్రజల మద్దతుతో రాజధాని అభివృద్ధి

తాజాగా ఏర్పాటు చేసిన డిజిటల్ విరాళాల వ్యవస్థ ద్వారా.. ప్రజల మద్దతుతో అమరావతిని అభివృద్ధి చేయాలన్న సంకల్పానికి మరింత బలం చేకూరనుంది. అన్ని వర్గాల మద్దతు లభిస్తుందన్న ఆశాభావంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది

ఇంతకీ మీరు కూడా విరాళం ఇవ్వాలంటే ఇలా చేస్తే చాలు

1. మొదటగా crda.ap.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళాలి

2. అక్కడ కనిపించే “Donate for Amaravati” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

3. యూపీఐ క్యూఆర్ కోడ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది

4. దాన్ని స్కాన్ చేస్తే పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది

5. తాము ఇవ్వాలనుకుంటున్న విరాళ మొత్తాన్ని ఎంటర్ చేయాలి

6. యూపీఐ పాస్‌వర్డ్ ఇచ్చిన తర్వాత లావాదేవీ పూర్తవుతుంది

7. ఈ మొత్తం నేరుగా సీఆర్డీఏ ఖాతాలోకి జమ అవుతుంది

ఈ ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలో, పారదర్శకంగా కొనసాగుతుంది. ఎలాంటి పేపర్‌వర్క్ లేకుండానే ప్రజలు తాము ఇష్టమైనంత మొత్తాన్ని విరాళంగా అందించవచ్చు.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *