హోంమంత్రి అమిత్ షా కొత్త రికార్డు సృష్టించారు. కేంద్ర హోంమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 2,258 రోజులు హోంమంత్రిగా పనిచేసిన అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ రికార్డును బద్దలు కొట్టారు. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రెండవసారి ఆయన మే 30, 2019న పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం (ఆగస్టు 5) జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటరీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రిని ప్రశంసించారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో రెండవసారి అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హోంమంత్రి అమిత్ షా పదవీకాలంలో ఈ ముఖ్యమైన మైలురాయి ఆగస్టు 5న జరిగింది. 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన రోజు ఇది. దీంతో పాటు, అమిత్ షా తన పదవీకాలంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన చేసిన ప్రకటనలు, ప్రతిపక్షాలకు తగిన సమాధానాలు కూడా ఆయన సాధించిన విజయాలలో ఉన్నాయి.
ఇప్పటి వరకు హోంమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన రికార్డు భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉంది. కాంగ్రెస్ నాయకుడు గోవింద్ బల్లభ్ పంత్ మూడవ స్థానంలో ఉన్నారు. అద్వానీ మార్చి 19, 1998 నుండి మే 22, 2004 వరకు ఈ పదవిలో 2,256 రోజుల పాటు కొనసాగారు. కాంగ్రెస్ నేత గోవింద్ బల్లభ్ పంత్ జనవరి 10, 1955 నుండి మార్చి 7, 1961 వరకు మొత్తం 6 సంవత్సరాల 56 రోజులు హోంమంత్రిగా కొనసాగారు. అదే సమయంలో వారిద్దరినీ కాదని, మే 30, 2019 నుండి ఆ పదవిలో ఉన్న అమిత్ షా ఆగస్టు 4, 2025న తన 2,258 రోజులను పూర్తి చేసుకున్నారు.
అమిత్‌షాకు పవన్ కల్యాణ్ అభినందనలు
కేంద్ర హోంమంత్రిగా రికార్డు సృష్టించిన అమిత్ షాకు దేశవ్యాప్తంగా నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమిత్ షాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “భారతదేశ హోంమంత్రిగా 2,559 రోజులు అంకితభావం, విశిష్టతతో దేశానికి సేవ చేసిన కేంద్ర హోంమత్రి అమిత్ షాకి హృదయపూర్వక అభినందనలు.140 కోట్లకు పైగా జనాభా కలిగిన విశాలమైన భారతదేశంలో అంతర్గత భద్రతను నిర్ధారించడం చాలా సవాళ్లతో కూడిన బాధ్యత. ఆయన అచంచలమైన నిబద్ధత, దృఢమైన, సకాలంలో నిర్ణయాలు, యుద్ధ ప్రాతిపదికన తీసుకునే విధానం భారతదేశాన్ని బలమైన, సురక్షితమైన దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. దేశంలో శాంతిభద్రతలను కాపాడటానికి, సేవ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలలో ఆయన విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. దేశ భద్రతను ఇంత సమర్థుల చేతుల్లో ఉంచినందుకు బీజేపీ నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.