మంచిగా మండపం ఏర్పాటు చేసి.. వినాయకుడి విశేష పూజలు చేయాలనుకుంటున్నారా..? భక్తిశ్రద్దలతో, నోరూరించే నైవేద్యాలతో అందరూ కలిసి ఆ ఆది దేవుడ్ని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. ఏపీ వ్యాప్తంగా గణేశ్ మండపాలకు.. ఉచితంగా కరెంట్ అందజేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న వేళ.. గణేశ్ మండపాల నిర్వాహకులకు శుభవార్త అందింది. ఉత్సవ మండపాల్లో ఏర్పాటు చేసే పందిళ్లకు ఇకపై ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనుంది. వినాయక మండపాల నిర్వాహకులు ఇటీవల మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. ముఖ్యంగా విగ్రహాల వద్ద విద్యుత్ మీటర్లు తీసుకోవడంలో వచ్చే ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై లోకేశ్ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 15 వేల గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా. ఆయా చోట్ల పందిళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే ప్రభుత్వానికి దాదాపు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. అయినా కోట్లాది గణేశ్ భక్తుల సౌకర్యం కోసం ఈ ఖర్చును ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే కాకుండా రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం అందించనుంది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ ఉత్సాహం మరింత రెట్టింపవనుంది.