భర్తపై అలిగితే ఫ్రీ బస్సు ఎక్కి పుట్టింటింటికి వచ్చేయండి.. మగాళ్లే టికెట్ పెట్టుకుని వచ్చి కాపురానికి తీసుకువెళతారు.. ఇదన్నది ఎవరో కాదండి బాబోయ్.. ఈ కామెంట్స్ తూర్పు గోదావరిజిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు సర్కార్.. ఈ నెల (ఆగస్టు) 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.. దీనికోసం విధివిధానాలతోపాటు.. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏంఎల్ఏ వెంకటరాజు ఒక సభలో పై విధంగా స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ మేరకు ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టనుంది.
ఓ సభలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఇపుడు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. “భర్తలు విసుక్కుంటే.. కసురుకుంటే ఎవరూ పడొద్దు.. హ్యాపీగా బస్సు ఎక్కి ఫ్రీ గా పుట్టింటికి వెళ్లిపోండి.. వాళ్లే చార్జీలు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు” అని ఏంఎల్ఏ అనటంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి.
ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెం ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. మరోవైవు ఆర్టీసి బస్సులను భార్యా, భర్తలు విడిపోవటానికి ఉపయోగిస్తారా అంటూ విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.