ప్రయాణికుల కోసం ట్రైన్ రివర్స్ వెళ్లడం మీరు ఎప్పుడైన చూశారా ? లేదు కదా.. కానీ ఇక్కడ ఒక ట్రైన్ మాత్రం జారిపడిపోయిన ఒక ప్రయాణికుడి కోసం ఏకంగా కిలో మీటర్‌న్నర దూరం వెనక్కి ప్రయాణించి అతడి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. కానీ వారి శ్రమ పలించలేదు. పోలీసులు కథనం ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన కమలకంటి హరిబాబు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పనుల నిమిత్తం యలహంకకు వెళ్లేందుకు కొండవీడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ట్రైన్ ప్రకాశం జిల్లాలోని గజ్జలకొండ స్టేషన్ దాటిన తర్వాత వాష్‌బేసిన్ వద్ద చేతులు కడుకునేందుకు వెళ్లిన హరిబాబు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.
అది గమనించిన ప్రయాణికులు వెంటనే అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చి ట్రైన్ చైన్ లాగారు. దీంతో ట్రైన్ ఆగిపోయింది. కానీ ట్రైన్ అప్పటికే హరిబాబు పడిపోయిన ప్రదేశం నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. హరిబాబు స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న లోకోపైలెట్ ఉన్నతాధికారులకు జరిగిన సంఘటన వివరించి. ట్రైన్‌ను రివర్స్ తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరారు. అందుకు అధికారులు అంగీకరించడంతో ఆయన ట్రైన్‌ను రివర్స్ గేర్‌లో వెనక్కి తీసుకెళ్లి గాయపడిన హరిబాబును ట్రైన్‌లోకి ఎక్కించుకుని నెక్ట్స్ స్టేషన్‌కు తరలించారు.
తర్వాతి స్టేషన్‌లో హరిబాబును ట్రైన్‌లో నుంచి దించి 108 అంబులెన్స్ ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ హరిబాబును పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే అతను హరిబాబు కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అతని మృతిపై తీవ్ర విచారం వ్యక్తి చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.