తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి.. దీంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది.. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య.. వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇవ్వాల్టి నుంచి భానుడు మరింత ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది..
తెలంగాణలో వాతావరణం ఇలా..
దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుండి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి క్రమేపి రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో వడగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం గరిష్టంగా అదిలాబాద్‌లో 39.3 కనిష్టంగా నల్లగొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్, లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి.. ఆదిలాబాద్..38.3, భద్రాచలం..38, నిజామాబాద్..37.3, ఖమ్మం..36.6, మహబూబ్ నగర్..35.5, నల్లగొండ..36, రామగుండం..35.6, మెదక్..35.4, హనుమకొండ..35, హైదరాబాద్..33.8 డిగ్రీల పగలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..
ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. నేడు 108 మండలాల్లో తీవ్రవాడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా -15, విజయనగరం జిల్లా-21, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3, తూర్పుగోదావరి-13, ఏలూరు-5, కృష్ణా -2 ఎన్టీఆర్-6, గుంటూరు-3, పల్నాడు-8 మండలాల్లో వడగాల్పులు (108) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.. గురువారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు..206 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
కాగా.. మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.1°C, నెల్లూరు జిల్లా సోమశిలలో 40.9°C, అన్నమయ్య జిల్లా పూతనవారిపల్లి, చిత్తూరు జిల్లా పిపల్లి, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 40.1°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అలాగే 15 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా బయటకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ..
Amaravati News Navyandhra First Digital News Portal