తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ CEOకి లేఖ రాశారు.
బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆస్పత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే.. NTR వైద్య సేవ కింద OP సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఏపీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆస్పత్రులు వెనక్కు తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్‌వర్క్ ఆస్పత్రులు.
ఇటు తెలంగాణలోనూ ఇవాళ మంగళవారం (సెప్టెంబర్ 15) అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా EHS, JHS బకాయిలు ఇవ్వలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.