ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొబైల్ ఫోన్ల వినియోగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కొంతమంది సభ్యులు సభలో కూర్చోనే ఫోన్లలో మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించే అసెంబ్లీలో మొబైల్ ఫోన్లను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత సంభాషణల్లో నిమగ్నమవుతుండటం తగదంటూ సభ్యులను సున్నితంగా హెచ్చురించారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ఒక పవిత్ర వేదిక అని, ఇక్కడి గౌరవాన్ని అన్ని సందర్భాల్లో రక్షించాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. సభా కార్యకలాపాల సమయంలో సభ్యులు మొబైల్ ఫోన్లను వాడడం తగదని, అత్యవసరమైతే బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు.
సభ్యులు స్వీయ క్రమశిక్షణ పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని సూచిస్తూ, అసెంబ్లీ నియమ నిబంధనలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి సంబంధం లేని విషయాలు చర్చించేందుకు సభలోనే ఫోన్ కాల్స్ చేయడం తగదని డిప్యూటీ స్పీకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, సభలో జరుగుతున్న చర్చలను పట్టించుకోకుండా కొందరు నేరుగా ఫోన్‌లో మాట్లాడటం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి సంబంధించిన నియమాలు, నిబంధనలపై అవగాహన కలిగి ఉండి, వాటిని పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మొబైల్ సిగ్నల్స్‌ను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన జామర్‌లపై కొన్ని వ్యాఖ్యలు చేసిన కొంతమంది సభ్యులపై కూడా డిప్యూటీ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనమే జామ్ చేసుకోకుండా జామర్‌లపై వంక పెట్టడం సరికాదు” అంటూ ఆయన చురకలంటించారు. సభ్యులు సభా నియమాలను గౌరవిస్తూ, తమ ప్రవర్తనతో అసెంబ్లీ గౌరవాన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు. ఇలాంటి విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయని, మరోసారి ఇలాంటి పరిస్థితి కనిపిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. సభా నియమాలను ఉల్లంఘించి మొబైల్ ఫోన్లను అసెంబ్లీ హాలులో ఉపయోగించడం సబబు కాదని, సభ్యులు సముచిత ప్రవర్తన పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal