ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. డీఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్ధులు పట్టుదలతో సిద్ధంకావాలని, అవకాశం తప్పకుండా వస్తుందని అన్నారు. ఇక తుది జాబితాలో చోటు..
రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మెగా డీఎస్సీని విజయవంతంగా నెరవేర్చింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నియమక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇందులో 15,941 పోస్టులు భర్తీకాగా.. 406 మిగులు పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి తుది మెరిట్ జాబితాను కూడా తాజాగా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు వెబ్‌సైట్ నుంచి ఈ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తాజాగా దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్ధులు పట్టుదలతో సిద్ధంకావాలని, అవకాశం తప్పకుండా వస్తుందని అన్నారు. ఇక తుది జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ప్రతి తరగతి గదికీ చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారని అన్నారు. డీఎస్సీని 150 రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొంటూ లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు.
ఇక తాజా డీఎస్సీలో మిగిలిన 406 పోస్టుల్లో ఏయే జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎన్ని చొప్పున ఖాళీలు ఏర్పడ్డాయో కూడా సర్కార్ వెల్లడించింది. అనంతపురంలో 56 పోస్టులు, చిత్తూరులో 70, తూర్పు గోదావరిలో 4, గుంటూరులో 19, కడపలో 32, కృష్ణాలో 10, కర్నూల్లో 88, నెల్లూరులో16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రకాశంలో 11, శ్రీకాకుళంలో 8, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, పశ్చిమ గోదావరిలో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోన్ 1లో 5, జోన్2లో 17, జోన్3లో 14, జోన్4లో 19తో మెుత్తం 406 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను వచ్చే డీఎస్సీలో భర్తీ చేసే అవకాశం ఉంది.