ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు…కమాన్‌, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.

కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా కూటమి సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులందరూ ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం లభించింది.

మే 15వరకు దరఖాస్తులు

ఈ మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం ‘ఎక్స్‌’ ద్వారా విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మే 20 నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. డీఎస్సీ అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు.

మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్‌, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

About Kadam

Check Also

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి, కుటుంబంలో విషాదం

కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురం కు చెందిన మూడు కుటుంబాలపై పెహల్గాం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *