టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మంగళవారం ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అలాగే దర్యాప్తుకు సహకరించాలని వర్మను ఆదేశించింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేశ్ పై సోషల్ మీడియాలో చేసిన అభ్యంకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ టీడీపీ, జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఆర్జీవీ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులపై తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలోనే వర్మ పిటిషన్స్ పై మంగళవారం ఉదయం విచారణ జరిగింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేశ్ పై ఆర్జీవీ అభ్యంతకర పోస్టులు పెట్టాడని ప్రకాశం,అనకాపల్లి, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ మూడు ప్రాంతాల్లో తనపై నమోదైన కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే గత విచారణలో శుక్రవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
కేసుల విషయానికి వస్తే..
ఈ ఏడాది మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టారని ఆర్జీవీపై టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ముందుగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది నవంబర్ 11న టీడీపీ మండల కార్యదర్శి ఎం. రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేను నమోదు చేశారు. టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా తుళ్లూరులో, అనకాపల్లి జిల్లా రావికమతంలోనూ ఆర్జీవీపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. అయితే మద్దిపాడు పోలీసులు విచారణకు రావాలని వర్మకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ తన సినిమా షూటింగ్ కారణంగా విచారణకు రాలేనని సమయం ఇవ్వాలని కోరారు వర్మ. అదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. ఈ క్రమంలోనే నేడు ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ మూడు కేసులలో వర్మకు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు.