ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13న నుంచి వెబ్ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది..
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జులై 13న నుంచి వెబ్ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. సవరించిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్ ఎంట్రీకి జూలై 21 వరకు అవకాశం ఉంటుంది. కట్-ఆఫ్‌లను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు గరిష్టంగా ఐదు ప్రాధాన్యాలను ఇవ్వవచ్చు.
ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం కారణంగా ఐసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి 340 వరకు ఉన్నాయి. వీటిలో సీట్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవోలు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా వెబ్ ఐచ్ఛికాలు వాయిదా పడ్డాయి. అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 19 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లను సవరించడానికి జూలై 22న అవకాశం ఇస్తారు. తొలి దశ సీట్ల కేటాయింపు జూలై 25న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులు జూలై 26 నుంచి 28 మధ్య వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు జూలై 28 నుంచి ప్రారంభమవుతాయి.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత ఫౌండేషన్ కోర్సు
తెలంగాణ బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో గ్రూప్ 1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్‌ల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సు అందించనున్నట్లు స్టడీసర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులు జులై 16 నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,000 చొప్పున 5 నెలలపాటు స్టైపెండ్‌తోపాటు ఉచిత స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 040-24071178 ఫోన్ నంబరును సంప్రదించాలని సూచించారు.