విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ సిలబస్, పరీక్ష విధానం మారుతుందోచ్‌..! కొత్త విధానం ఇదే

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పబ్లిక్‌ పరీక్ష విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిని 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. మొదటిసారిగా ఇంటర్‌ విద్యలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు ఇంటర్‌ సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్‌ బోర్డు పలు మార్పులు చేసింది. ఈ మార్పుల వివరాలను తాజాగా జూనియర్‌ కళాశాలలకు పంపింది. ఇంటర్‌ మొదటి ఏడాదిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్‌కు పొడిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇప్పటివరకు ఇంటర్‌ గణితంలో ఏ, బీ పేపర్లు ఉండగా 75 మార్కుల చొప్పున 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఇకపై పబ్లిక్‌ పరీక్షల్లో ఈ రెండూ కలిపి ఒక్క పేపర్‌గానే ఇవ్వనున్నారు. మార్కులు సైతం వందకు కుదిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులందరూ మ్యాథమెటిక్స్‌ ఒక్క పేపర్‌ వంద మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అలాగే భౌతిక, రసాయనశాస్త్రాలు ఇప్పటివరకు 60 మార్కుల చొప్పున ఉండగా.. ఈ మార్కులు 85కి పెరిగాయి. మొదటి ఏడాదిలోని 15 మార్కులు, రెండో ఏడాదిలోని 15 మార్కులు కలిపి 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. బైపీసీలోని వృక్ష, జంతుశాస్త్ర సబ్జెక్టులు రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా ఇవ్వనున్నారు. దీనిని జీవశాస్త్రంగా పిలుస్తారు. ఇందులో 43 మార్కులకు వృక్ష శాస్త్రం, 42 మార్కులకు జంతుశాస్త్రం ఉంటుంది. మొత్తం 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. సీఈసీ గ్రూపులో కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కుల చొప్పున ఒక పేపర్‌ ఉంటుంది. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు ఎలాంటి మార్పు చేయలేదు. ఆంగ్లం, కామర్స్‌లో అకౌంటెన్సీ మినహా మిగతా అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోనూ నాలుగు సెక్షన్లు ఉంటాయి. సైన్సు గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. సీబీఎస్‌ఈ విధానంలో వీటిని ప్రవేశపెట్టారు.

వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ మొత్తం పనిదినాలు 314 ఉన్నాయి. ఇందులో 79 సెలవులు ఉన్నాయి. మిగతా 235 రోజులు తరగతులు కొనసాగుతాయి. ఈ మేరకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తున్నందున విద్యా సంవత్సరంలోనూ మార్పు చేసింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇంటర్ విద్యార్ధులకు క్లాసులు పునఃప్రారంభమవుతాయి. ఏప్రిల్‌ 23 వరకు తరగతులు నిర్వహించి, 24 నుంచి జూన్‌ ఒకటి వరకు సెలవులు ఇస్తారు. దసరా సెలవులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరిలో, పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో ఉంటాయి.

About Kadam

Check Also

కలియుగంలో అపర కుభేరుడు ఆయనే.. అంతకంతకూ పెరుగుతున్న వెంకన్న ఆదాయం

కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం.  అయితే ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *