ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. 2 నెలల్లో అంత తాగేశారా, ఆదాయం ఏకంగా వేల కోట్లలో!

AP Liquor Sales Record: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రికాస్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపుల్లో రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 16 నుంచి 3,396 షాపులు ప్రారంభంకాగా.. నాణ్యమైన మద్యం లభిస్తుండటంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. దాదాపు రెండు నెలల్లోనే భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగిన మద్యం అమ్మకాలపై క్లారిటీ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల మేర లిక్కర్‌ సేల్స్‌ జరిగాయని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. వీటిలో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్ని ప్రభుత్వమే నడపగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఆ వెంటనే మద్యం షాపులకు టెండర్లను పిలిచి లాటరీ ద్వారా షాపుల్ని కేటాయించారు. ఈ టెండర్ల రూపంలో ప్రభుత్వానికి దాదాపు రూ.2,000 కోట్ల ఆదాయం వచ్చింది. రెండేళ్ల పాటూ మద్యం షాపులకు లైసెన్స్ ఇచ్చారు.. ఆ తర్వాత మళ్లీ లాటరీ ద్వారా షాపుల్ని కేటాయిస్తారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. నాణ్యమైన మద్యం రూ.99కే క్వార్టర్ విక్రయిస్తామని ప్రభుత్వం తెలిపింది.. ఈ మేరకు కొన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే మరికొన్ని ‌నేషనల్‌ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎమ్మార్పీ ఉల్లంఘించే, బెల్ట్‌ షాపులకు మద్యం విక్రయించే షాపులకు మొదటిసారి తప్పు చేస్తే రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ఆ తర్వాత తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దుని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మద్యం దుకాణాల యజమానులు బెల్ట్‌ షాపుల్ని ప్రోత్సహించినా.. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రతి షాపు దగ్గర సీసీ కెమెరాలు, ధరల వివరాల్ని తెలియజేస్తూ బోర్డులు కచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఏర్పాటు చేయమని అధికారులకు సూచించారు.

మరోవైపు మద్యం షాపులు దక్కించుకున్నవారు మాత్రం తాము నష్టపోతున్నామని చెబుతున్నారు. తమకు 20శాతం మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ తమకు 10శాతం మార్జిన్ వస్తుందని.. ఇలాగైతే తాము షాపుల్ని నడపలేమంటున్నారు. తమకు 20శాతం మార్జిన్ ఇస్తేనే లాభాలు వస్తాయని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు మద్యం షాపుల యజమానులు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయగా.. ప్రభుత్వం ఓ నివేదికను సిద్ధం చేస్తోంది.


About Kadam

Check Also

AP Inter Exam Schedule: మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఇంటర్మీడియేట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *