రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇటీవల మెరిట్ లిస్ట్ విడుదల చేసిన విద్యాశాఖ తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్ట్ 25వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభంకావల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆగస్ట్ 26వ తేదీకి వాయిదా పడింది. దీంతో నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నారు.
అయితే మెగా డీఎస్సీలో చాలా మంది అభ్యర్ధులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో అభ్యర్థులు తొలి ప్రాధాన్యం కింద ఇచ్చిన పోస్టుకు ఎంపిక చేసి, మిగిలిన పోస్టులను ఆ తర్వాత మెరిట్ లిస్ట్‌లో ఉన్న వారికి కేటాయించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించి అభ్యర్ధులు పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదని డీఎస్సీ కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి తాజాగా స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలకు ముందే దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు పోస్టులు ఎంపిక చేసుకున్నారని, ఇక వాటిని మార్చే అవకాశం ఉండబోదని తెలిపారు. ఇప్పటికే మెరిట్ లిస్టు ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ నాలుగుసార్లు అవకాశం కల్పించింది. దీంతో డీఎస్సీలో అభ్యర్ధుల తొలి ప్రాధాన్యానికే ప్రాముఖ్యత ఇస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పటినుంచంటే?
డీఎస్సీ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గురువారం (ఆగస్ట్ 28) నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. నిజానికి ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. సోమవారం రాత్రి నుంచి అభ్యర్ధులకు కాల్‌లెటర్లు పంపించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి డీఎస్సీ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు కాల్‌లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వినర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్ధులందరికీ వారు దరఖాస్తు చేసిన అన్ని పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన సంబంధిత జిల్లాల్లోనే ఆగస్ట్ 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చెప్పారు. డీఎస్సీ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.