What is Normalization? రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. అయితే అంతలోనే మరో బాంబ్ విద్యాశాఖ పేల్చింది. అదేంటంటే.. డీఎస్సీ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇందులో నార్మలైజేషన్ అమలు చేయనున్నట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. సిలబస్‌తోపాటు అర్హతలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, రాత పరీక్షల షెడ్యూల్, పరీక్ష ఫీజు వంటి ఇతర పూర్తి వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మెగా డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారితంగా జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల చొప్పున దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. డీఎస్సీకి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఒకవేళ అభ్యర్థుల సంఖ్య పెరిగి, పరీక్ష కేంద్రాల సమస్య ఏర్పడితే ఆయా జిల్లాలకు సమీపంలోని పక్క రాష్ట్రాల్లోనూ కేంద్రాలను కేటాయిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం ఒక విడతకు 300 నుంచి 500మంది పరీక్ష రాసే సామర్థ్యంతో ఉంటాయి. డీఎస్సీ నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో సెషన్లను కలిపి ఈఏపీసెట్, జేఈఈల్లో అమలుచేస్తున్నట్లు నార్మలైజేషన్ విధానాన్ని పాటించనున్నట్లు అధికారులు తెలిపారు. పీజీటీ, టీజీటీలకు ఇంగ్లిష్ మాధ్యమంతోపాటు పదోతరగతిలో మొదటి భాష, ఇంటర్మీడియట్‌లో రెండోభాష, డిగ్రీలో చదువుకున్న భాషకు అనుగుణంగా ఇంగ్లిష్‌తోపాటు మరో భాషలో ప్రశ్నపత్రం ఇస్తారు. ఇతర పోస్టులకు ఇంగ్లిష్‌తో పాటు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. పీడీ, పీఈటీలకు ఆంగ్లంతోపాటు తెలుగులోనూ ప్రశ్నపత్రం ఇస్తారు.
నార్మలైజేషన్ అంటే..?
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లల్లో ఒక్కోసారి 5 సెషన్లలోనూ పరీక్షలు నిర్వహించే అవకాశముంది. ఒక పేపర్ ఈజీగా లేదా మధ్యస్తంగా.. మరో పేపర్ కఠినంగా వస్తే ఆయా సెషన్‌లో పరీక్షకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. దీంతో సులభంగా ప్రశ్నలొచ్చిన వారికి లాభం జరగగా, కఠినంగా వచ్చినవారికి నష్టం కలిగే అవకాశం ఉంది. గతంలో ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నపత్రాన్నిచ్చేవారు. పేపర్ల మూల్యాకంనంలో ఇబ్బందులొచ్చేవి కాదు. కానీప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో అభ్యర్ధులకు నార్మలైజేషన్ బెదురు పట్టుకుంది. నిజానికి ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలన్నింటిలోనూ నార్మలైజేషన్ విధానం అమవుతుంది. నార్మలైజేషన్‌లో భాగంగా సులభంగా వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనావేసి సరాసరి మార్కులేస్తారు. ఈ విధానంలో సులభంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కోత విధించి, కఠినంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కలుపుతారు. ఇది ప్రశ్నల తీరును బట్టి.. సబ్జెక్టు నిపుణుల విచక్షణ మేరకే జరుగుతుంది. ఫలితంగా ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో ఖచ్చితంగా అంచనా వేసే అవకాశం ఉండదు. దీంతో అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.