పవన్ ‘సీజ్ ది షిప్’ తర్వాత రగులుతున్న రాజకీయం.. రచ్చ మామూలుగా లేదుగా..

చౌకబియ్యం చుట్టూ జరుగుతున్న రాద్ధాంతం.. ఏపీ రాజకీయాల్ని ఉడుకెత్తిస్తోంది. సీజ్‌ ది షిప్.. అంటూ కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం మొదలుపెట్టిన బియ్యం గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఇంతకీ.. ఆ బియ్యం ఎవరివి.. అని ఆరా తీస్తే.. మంత్రిగారి వియ్యంకుడి పేరే బైటికొస్తోంది. ఇంకేముంది విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇష్యూని మరింత సీరియస్‌ చేస్తూ బాంబులు పేల్చాయి. మరి కూటమి ప్రభుత్వం రియాక్షన్లేంటి..? రెండుగంటల పాటు జరిగిన భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం తేల్చిందేంటి…? 

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టులో హల్‌చల్ చేసి.. షిప్పుల్లో జరిపిన తనిఖీలపై రాజకీయ రగడ చల్లారనే లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న సిండికేట్ వ్యవహారమని, ఇందులో లోకల్ టు గ్లోబల్ అనేకమంది చేతివాటం ఉందని ఆరోపణలొస్తున్నాయి. ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుందంటూ బాంబ్‌ పేల్చింది వైసీపీ.

అలాగే పవన్‌ టూర్‌పై కొత్తకొత్త సందేహాల్ని వ్యక్తం చేస్తోంది వైసీపీ. స్టెల్లా షిప్‌ను జల్లెడపట్టారు సరే.. కెన్‌స్టార్ షిప్పును ఎందుకు వదిలిపెట్టారు అనే లాజిక్‌తో ముందుకొచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. కెన్‌స్టార్‌ షిప్‌లో 42వేల టన్నుల బియ్యం ఉందంటూ బాంబ్‌ పేల్చారు. ఆర్థిక శాఖమంత్రి వియ్యంకుడి షిప్పు కనుకనే దాన్ని ఉపేక్షించారంటూ మండిపడ్డారు. ఆ షిప్‌ను పవన్‌ ఎందుకు విజిట్‌ చేయలేదంటూ ఫైర్ అయ్యారు.

ఏపీ కాంగ్రెస్‌ కూడా ఈ ఇష్యూపై కస్సుమంటోంది. రేషన్‌ బియ్యం తరలింపు వెనుక పెద్దసైజు మాఫియా ఉందని ఆరోపిస్తోంది. ఇదొక జాతీయస్థాయి కుంభకోణమంటున్నారు షర్మిల. అవినీతి అధికారుల ప్రమేయం ఉందని, ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యమైపోయిందన్నారు. మొత్తం వ్యవహారంపై అవసరమైతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారామె.

రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న మాట నిజం.. దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట కూడా నిజం అంటోంది టీడీపీ. అందుకే పవన్‌కల్యాణ్‌ రంగంలోకి దిగి.. ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్నారంటూ చెప్తోంది..

సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో బియ్యం ప్రస్తావన!

రైస్‌ రాజకీయం ఇలా రచ్చ లేపుతుండగా… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య మంతనాలు జరిగాయి. పాలనాపరమైన అనేక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగినట్టు తెలుస్తోంది. కాకినాడ పోర్ట్ ఎపిసోడ్‌, బియ్యం అక్రమ రవాణా కూడా ప్రస్తావనకొచ్చిందని, కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిందని, బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరినట్టు సమాచారం. ఇటు పోర్టుల నుంచి చౌక బియ్యం అక్రమ తరలింపును అరికట్టడంపై ఏపీ సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అచ్చెన్నాయుడు కూడా సమీక్షించారు. మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో…!

About Kadam

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *