ఇక మెడికల్‌ పీజీ సీట్లు మొత్తం AP విద్యార్థులకే.. తెలంగాణకు నో ఛాన్స్!

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల తరహాలోనే.. పీజీ కోర్సుల ప్రవేశ నిబంధనల్లోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అమల్లో ఉన్న ఉమ్మడి ప్రవేశ విధానం గడువు పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తాత్కాలిక సవరణలు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో (నాన్‌ స్టేట్‌ వైడ్‌) ప్రతి కోర్సుకు 85 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థానిక అభ్యర్థులకు కేటాయించాలని అందులో పేర్కొంది. మిగిలిన 15 శాతం సీట్లను అన్‌రిజర్వుడు కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన స్థానికేతర అభ్యర్థులకు కేటాయించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్‌వీయూ పరిధిలోని కాలేజీల్లో స్థానిక, అన్‌రిజర్వుడు కేటగిరీలో సీట్లు పొందేందుకు అర్హతలను కూడా వెల్లడించింది.

రేపే తెలంగాణ ఆర్జీయూకేటీ మూడో విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని బాసర, మహబూబ్‌నగర్‌ ఆర్జీయూకేటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పీయూసీ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించి మూడో విడత జాబితా వర్సిటీ వీసీ గోవర్ధన్‌ విడుదల చేశారు. మూడో జాబితాలోని విద్యార్ధులకు జులై 25న కౌన్సెలింగ్‌ ఉంటుందని అన్నారు. గ్లోబల్‌ కోటాను ఎంచుకున్న తెలంగాణ విద్యార్థులకు జులై 24న కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా కింద ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తైనప్పటికీ ఎంపికైన వారి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈసెట్‌లో 57 శాతం సీట్ల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీటెక్‌ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో 57 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. తుది విడత కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ జాబితాను తాజాగా సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 36,534 సీట్లు ఉండగా అందులో 20,837 భర్తీ అయినట్లు వెల్లడించింది. ప్రభుత్వ పరిధిలో 1,800 సీట్లు ఉండగా.. ఇందులో 1,485 సీట్లు భర్తీ అయ్యాయి.

About Kadam

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *