రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది..
ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా పదో తరగతి ఫలితాలు మంత్రి లోకేష్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదు చేశారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.78 శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు.