పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వైద్యులు అన్నారు. ఇవి వార్మ్ బ్లడెడ్ జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని అన్నారు. అవి శరీర గాయాల ద్వారా రోగి శరీరంలోకి వెళ్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాలకు ముప్పు..
ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. కొన్ని చికిత్సలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. వైద్యులు శస్త్రచికిత్స చేసి మహిళ మెదడు నుంచి పరాన్నజీవిని తొలగించారు. తిరువూరుకు చెందిన 50 ఏళ్ల సరోజిని తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. ఈ నొప్పి కారణంగా తరచూ అపస్మారక స్థితికి వెళ్లి మూత్రవిసర్జన అవుతుంటుంది. దీంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 4న ఆసుపత్రికి తీసుకెళ్లారు.
దీంతో న్యూరో సర్జరీ విభాగాధిపతి డా.శ్యామ్ బాబ్జీ ఆమెను పరీక్షించారు. తలపై లోతైన గాయాన్ని, దాని నుంచి చీము కారుతున్న విషయాన్ని గ్రహించారు. అందులో కదులుతున్న క్రిములను ఆయన గుర్తించారు. అసలు విషయాన్ని తెలుసుకునేందుకు తలకు స్కాన్ చేయగా, మెదడులో చీము గడ్డతో పాటు పరాన్నజీవి ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు గత నెల 13న శస్త్రచికిత్స చేశారు. పరాన్నజీవిని తొలగించారు. నెల రోజులుగా ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సందర్భంగా డా.శ్యామ్‌బాబ్జీ మాట్లాడుతూ.. తలపై పుండును స్క్వామస్ సెల్ కార్సినోమాగా గుర్తించామని తెలిపారు. సాధారణంగా ఈగల నుంచి జన్మించే మెగ్గాట్.. జంతువులు, మనుషుల శరీరంలో నిర్జీవ కణ జలాలపై ఆధారపడి జీవిస్తాయని ఆయన తెలిపారు.
పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు:
పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వైద్యులు అన్నారు. ఇవి వార్మ్ బ్లడెడ్ జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని అన్నారు. అవి శరీర గాయాల ద్వారా రోగి శరీరంలోకి వెళ్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాలకు ముప్పు కలిగేలా ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఆమె ఉషారుగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా.ఏవీ రావు, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.ఏడుకొండలరావు, డీఎంఈ రఘునందన్‌రావు వైద్యులను అభినందించారు.