హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్.. ఈసారి ఆ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ కావడం ఖాయం..

హైదరాబాద్ మహానగరం మరింత సొబగులు అద్దుకొనుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన మీరాలం చెరువుపై ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగరానికి ఆకర్షణగా నిలిచి.. పర్యాటకానికి ఓ కొత్త దిక్సూచి అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మీరాలం చెరువును కేంద్రంగా చేసుకుని మరో అద్భుతమైన వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.430 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ వంతెన నిర్మాణ బాధ్యతను మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్‌డీసీఎల్)కు అప్పగిస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, టెండరు ప్రక్రియలను తక్షణమే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐకానిక్ బ్రిడ్జి మోడల్‌ను ఐఐటీ హైదరాబాద్, జేఎన్టీయూ, వరంగల్ నిట్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చూపించి.. నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మీరాలం చెరువు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినది. మైలార్‌దేవ్‌పల్లి, హసన్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా నగర దాహార్తిని తీర్చేందుకు మూడో నిజాం హయాంలో, దివాన్ మీర్ ఆలం బహదూర్ గారి పేరుపెట్టి ఈ చెరువును నిర్మించారు. 1804లో ప్రారంభమైన నిర్మాణం 1806లో పూర్తయ్యింది. అర్ధచంద్రాకార రూపంలో ఉన్న చెరువు విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది. చెరువు మధ్యలో మూడు దీవులు ఉండగా.. ఒకప్పటి 600 ఎకరాల విస్తీర్ణం ప్రస్తుతం 450 ఎకరాలకు పరిమితం అయింది. చెరువు దిగువన ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాల మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ రెండు ఆకర్షణలను ఐకానిక్ బ్రిడ్జితో అనుసంధానం చేస్తూ, పర్యాటకాభివృద్ధికి బలం చేకూర్చేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. బెంగళూరు జాతీయ రహదారి మీదుగా, చెరువు పశ్చిమాన ఉన్న చింతల్‌మెట్ నుంచి తూర్పున శాస్త్రిపురం వరకు ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీని పొడవు సుమారు 2.5 కిలోమీటర్లు కాగా, వెడల్పు 16.5 మీటర్లుగా ఉంటుంది. ఇందులో నాలుగు రోడ్లు, పక్కన విశాలమైన కాలిబాట ఏర్పాటవుతుంది.

ఈ వంతెన నిర్మాణం పూర్తైతే బహదూర్‌పుర, అత్తాపూర్, కిషన్‌బాగ్, చింతల్‌మెట్, శాస్త్రిపురం వంటి ప్రాంతాల్లోని వాహనదారులకు రవాణా సౌలభ్యం పెరుగుతుంది. అంతేగాక, చింతల్‌మెట్ నుంచి బెంగళూరు హైవే మీదుగా విమానాశ్రయం వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక ప్రధాన మార్గంగా నిలవనుంది. పర్యాటకాభివృద్ధితో పాటు, నగరానికి కొత్త శోభను తీసుకురానున్న ఈ బ్రిడ్జి, హైదరాబాద్ కు మరో ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అవకాశముంది.

About Kadam

Check Also

తెలంగాణలో విద్యార్థులకు పండగ.. 13 రోజులు దసరా సెలవులు

తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *