ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంతా సిద్దం.. వైఎస్ జగన్ హాజరు.. మరోసారి ప్రతిపక్ష హోదా తెరపైకి.!

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమరం ప్రారంభం కాబోతోంది. అయితే, సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించడంతో వాతావరణం ఆసక్తికరంగా మారింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టే అవకాశాలున్నాయి. . ప్రతిపక్షంలో ఉన్నది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాసమస్యలపై గొంతువిప్పేది తాము మాత్రమే కాబట్టి.. ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోరుతూ ఇప్పటికే హైకోర్టులో వైసీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని స్పీకర్‌ను హైకోర్టు కోరినా.. ఇప్పటివరకూ తన అభిప్రాయాన్ని చెప్పలేదు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తోందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాసులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంకు మాత్రమే అసెంబ్లీ గేట్ 1 నుంచి అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు. మండలి ఛైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లే కారిడార్‌లోకి ఇతరులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. మంత్రులు, సభ్యుల వ్యక్తిగత సహాయకులను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని.. ఇతరులకు అనుమతి లేదన్నారు. శాసనసభ పరిసరాల్లో సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు పూర్తిగా నిషేధించారు. అయితే ఇదంతా జగన్‌ వస్తున్నందుకే అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *