సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండని ఆయా కంపెనీల సీవోలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా సీఎం వారికి వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారు. సింగపూర్ పర్యటన చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. వివిధ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి. కీలక కంపెనీలుగా ఉన్న కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు.
రియలెస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో సీఎం చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వారికి వివరించారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నామనే అంశాన్ని సీఎం చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో 30-35 శాతం ఐటీ పార్కుల్లో తాము పెట్టుబడులు పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రియల్ ఎస్టేట్ సహా పారిశ్రామిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కెపిటాల్యాండ్ ఇండియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.
డాల్ఫిన్ సిటీ.. బొటానికల్ గార్డెన్
మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థతో జరిగిన సమావేశంలో వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్శిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగంలో భాగస్వామ్యంతో వెళ్తే మంచి చక్కటి అభివృద్ధి సాధించవచ్చని ఆ గ్రూప్ సీఈఓ మైక్ బార్క్‌లేకు సీఎం సూచించారు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూ పార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేసే అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వైజాగ్‌లో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళ్తున్నామని.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు. ఈ మేరకు ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారు.
ఇక పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ, డిఫెన్స్, సివిల్ ఎరో స్పేస్ కారిడార్ వంటి ప్రాజెక్టుల గురించి రాజీవ్ కన్నన్‌కు సీఎం వివరించారు. ఓర్వకల్లు, లేపాక్షిల్లోని ప్రాజెక్టులకు అవసరమైన మేరకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై కన్నన్‌తో కీలక చర్చ జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పారిశ్రామి కారిడార్ల ప్రణాళికలకూ సహకారం అందించాలని సీఎం కోరారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని రాజీవ్ కన్నన్ చెప్పారు.
MSME, APIIC, జాయింట్ వెంచర్స్
పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆ సంస్థ నుంచి సహకారం కోరారు. MSME రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు భాగస్వాములుగా ఉండేందుకు టెమాసెక్ హెల్డింగ్స్ ఆసక్తి కనబరిచింది. అలాగే APIICతో కలిసి పనిచేస్తే అభివృద్ధికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని సీఎం సూచించారు. దీంతోపాటు వివిధ రంగాల్లో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపట్టే అంశంపైనా చంద్రబాబు-దినేష్ ఖన్నా మధ్య జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలను దినేష్ ఖన్నాకు సీఎం వివరించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఖన్నా చెప్పారు. ఈ వరుస సమావేశాల్లో మంత్రులు నారాయణ, టీజీ భరత్, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.