ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. మనం అడిగిన వెంటనే కేంద్రం యూరియా అందిస్తోంది అని హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా రైతులకు అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో అనంతపురంలో నిర్వహించిన NDA తొలి బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమిలో మూడు పార్టీల కార్యకర్తల స్పీడ్‌తో సపరిపాలనలో ఏపీ ప్రభుత్వాన్ని అడ్డే లేదన్నారు సీఎం చంద్రబాబు. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనకు అన్నంపెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ పథకం తెచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.
కేంద్రంతో కలిసి ఏడాదికి 3 విడతల్లో రూ. 20 వేలు ఇస్తామన్నామని, తొలి విడతగా ఇప్పటికే రూ. 7 వేలు ఇచ్చామని, 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు జమ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. నీళ్లిచ్చాం… మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం.. మార్కెట్ గిట్టుబాటు ధర వచ్చేలా చేశాం. ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఆర్ధిక కష్టాలున్నా…అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1704 కోట్లు ఖర్చు చేసి.. 2.45 కోట్ల ఉచిత సిలిండర్లు మహిళలకు ఇచ్చామన్నారు. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే.. ‘దీపం 2’ సూపర్ హిట్ అయ్యిందన్నారు. ఈ సభ రాజకీయాల కోసం కాదు. ఓట్ల కోసం కాదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. బాధ్యత గల ప్రభుత్వంగా కూటమి ఇచ్చిన మాటను నెరవేర్చిందని చెప్పడానికే ఇక్కడకు వచ్చామన్నారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. వీటి ద్వారా ఇప్పటివరకు 5.60 కోట్ల భోజనాలతో కడుపు నింపామని, ఇంతకంటే ఆనందం ఏముంది.? అని తెలిపారు. గత ప్రభుత్వం పేదల పొట్టకొట్టి.. అన్న క్యాంటీన్లను మూసేసింది. ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తాం. ఎన్నికల్లో చెప్పాం.. ఎన్ని కష్టాలున్నా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమన్న చంద్రబాబు.. అన్ని వర్గాల ప్రభుత్వమని, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలను మార్చేలా సంస్కరణలు తెస్తున్నాయన్నారు. GST సంస్కరణలతో పన్నులు తగ్గి నిత్యావసరాలు అందుబాటులోకి వస్తాయి. ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోట్ల మంది పేదల కొనుగోలు శక్తి పెంచుతుంది. ఇదే స్ఫూర్తితో యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చామని, దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయన్నారు. బీసీలను ఆదుకునేందుకు నేతన్నలకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, మద్యం షాపుల్లో 10 శాతం కేటాయింపులు, నాయీ బ్రాహ్మణులకు జీతాలు పెంపు, సెలూన్ లకు ఉచిత విద్యుత్, సోలార్ రూఫ్ టాప్ లో ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అర్చకులు, ఇమామ్, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచామని, ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశాం. ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.