శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయి. అంతేకాదు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తన నియోజకవర్గ ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకను అందజేస్తున్నారు. పాదగయ పుణ్యక్షేత్రం శ్రావణ మాస వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.
చివరి శ్రావణ శుక్రవారం సందర్బంగా పాదగయ క్షేత్రంలో కొలువైన ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. ఈ పూజలో పాల్గొంటున్న మహిళలకు చీర, పసుపు కుంకుమ అందచేస్తున్నారు.
ఈ ఓజు ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభం అయ్యాయి. ఐదు విడతలుగా ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. అయితే ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ వరలక్ష్మి వ్రత తొలి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మరెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున 10 వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేస్తున్నారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఐదు విడుదలగా నిర్వహించారు. ఈ ఒక్కో బ్యాచ్ కు ఒక్కో పేరు పెట్టారు. అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని పేర్లు పెట్టారు.
ఒక విడతలో వెయ్యి నుంచి 15 వందల మంది మహిళా భక్తులు వరలక్ష్మీ వ్రతం చేసేలా ఏర్పాట్లు చేశారు.
అంబిక బ్యాచ్‌లోని మహిళలు శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు.
భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు వ్రతంలో పాల్గొన్నారు.
చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు.. దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు పూజలు నిర్వహించారు. చివరగా ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
వరలక్ష్మీ వ్రతాలకు హాజరైన మహిళలకు మాత్రమే కాదు వరలక్ష్మీ వ్రతాలు పూర్తైన తర్వాత ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు కూడా ఈ కానుకలను అందించ నున్నారు.