ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. టెన్త్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి పదో తరగతి పరీక్షలు విద్యార్ధులు రాయనున్నారు. విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, పునశ్చరణ, పదోతరగతి పరీక్షల బ్లూప్రింట్ ప్రకారం ప్రీఫైనల్, గ్రాండ్ టెస్ట్ వంటి పక్కా ప్రణాళికను తయారు చేశారు. ఈ మేరకు ప్రణాళికలో సూచించిన విధంగా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో పబ్లిక్ హాలిడేలు మినహా ఆదివారాలతో సహా విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రణాళికలో విద్యాశాఖ సూచించింది. జనవరిలో ఇవ్వనున్న సంక్రాంతి సెలవులను కూడా భారీగా తగ్గించింది. దీంతో పదో తరగతి విద్యార్ధులకు జనవరి 13, 14, 15 తేదీలలో మాత్రమే మూడు రోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజులు మినహా మిగతా అన్నిరోజులూ అదనపు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.
సంక్రాంతి సెలవుల్లో సైతం విద్యార్ధులు ఇంటి వద్ద చదువుకునేలా మార్గదర్శకం చేయాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచించింది. మరోవైపు పదోతరగతి సిలబస్ పూర్తి కానందున ఈ షెడ్యూల్‌ను సైతం సవరించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ పదో తరగతి టైం టేబుల్ ఛేంజ్ చేస్తే మిగతా తరగతులకు మరో టైం టేబుల్ అమలు చేయవల్సి వస్తుంది. దీనివల్ల కింద తరగతులకు బోధనలో ఇబ్బందులొస్తాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీని విషయంలో విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Amaravati News Navyandhra First Digital News Portal