ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. మనుషులపైకి దాడులకు సైతం దిగాయి. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమైంది. టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు, ప్రజలను భయపెడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ నడుం బిగించింది. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అలాగే తిరుమల అడవుల్లో చిరుతల కదలికలను కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఏనుగుల కోసం అత్యాధునిక సాంకేతికత
ఏనుగుల కదలికలపై ముందస్తు సమాచారం కోసం అటవీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ సాంకేతికతను ఉపయోగించనుంది. దీని ద్వారా ఏనుగులు అటవీ ప్రాంతం నుండి పరిసర గ్రామాలకు ఒక కిలోమీటర్ దూరంలోకి రాగానే ప్రజల మొబైల్ ఫోన్లకు ‘‘ఏనుగులు వస్తున్నాయి, జాగ్రత్త’’ అంటూ మెసేజ్‌లు పంపిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం నిరంతర నిఘా కొనసాగిస్తుంది.
డ్రోన్లు, జీపీఎస్ పరికరాలు ఉపయోగించి ఏనుగుల కదలికలను అంచనా వేస్తారు. వాట్సాప్, లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ ప్రజలకు సమాచారం అందిస్తారు. ఇన్ఫ్రారెడ్, థర్మల్ సెన్సార్లతో కూడిన సౌరశక్తితో నడిచే స్మార్ట్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు. 1984లో ఏపీలో ఏనుగుల ఉనికి మొదలవగా ప్రస్తుతం వాటి సంఖ్య 30 నుంచి 32 వరకు ఉన్నట్లు 2024 గణనలో తేలింది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చర్యలను చేపడుతున్నారు.
తిరుమల కొండల్లో చిరుతల పర్యవేక్షణ
శేషాచలం అడవుల్లో భక్తుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల కదలికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అలిపిరి మార్గంలో 100 కెమెరా ట్రాప్లను అమర్చారు. 30 చోట్ల సౌరశక్తితో పనిచేసే లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి వన్యప్రాణుల కదలికలను ట్రాక్ చేస్తారు. డ్రోన్లను ఉపయోగించి అడవిపై నిఘా ఉంచుతారు. అవసరాన్ని బట్టి బోనులను కూడా ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకుంటారు.
పచ్చదనం పెంపు లక్ష్యం
వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా తిరుమల అటవీ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచేందుకు కూడా కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 64.14శాతం అడవి కవచాన్ని 2027-28 నాటికి 80శాతనికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం టీటీడీకి చెందిన 3,000 హెక్టార్లు, రిజర్వ్ ఫారెస్ట్‌లోని 7,000 హెక్టార్లలో మొక్కలు నాటనున్నారు. ఈ పర్యావరణ భద్రతా చర్యల కోసం రూ. 10.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.