ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పెంపు ఇప్పుడు ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లలు ఎందుకు కనలేరన్న చర్చలు ఏపీ రాజధానిలో మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే – ‘‘ఇంకా ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్లే నిజమైన దేశభక్తులు.’’ ఆ మాటలకి ఇప్పుడు సర్కారు దారులు వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి నుంచి ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పలు రకాల ప్రయోజనాలు ఇవ్వాలనే పాలసీని రాష్ట్రం సిద్ధం చేస్తోంది. మొదటిగా – మూడో బిడ్డ పుట్టిన తల్లికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని చూస్తున్నారు. నాలుగో బిడ్డ పుడితే కూడా ఆస్తి పన్ను మినహాయింపు లాంటి అనేక ప్రోత్సాహకాలను కొనసాగించాలనేది యోచన.
కొంతమందికి పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉంటాయి. అలాంటి కుటుంబాల కోసం ప్రభుత్వమే ముందుకొస్తోంది. పిల్లలు పుట్టేలా చేసే ఐవీఎఫ్ చికిత్స చాలా ఖరీదైనది. ఒక్కసారి చికిత్సకు దాదాపు తొంభై వేల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఖర్చులో కనీసం కొంత భాగాన్ని ప్రభుత్వమే భరించాలన్నది ముసాయిదాలో ఉంది. ఇది ఎంతోమందికి ఉపయోగపడే నిర్ణయం. పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే. కానీ ఉద్యోగం చేస్తున్న తల్లులైతే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అందుకే వారికి ‘వర్క్ ఫ్రమ్ హోం’ సౌకర్యం ఇవ్వాలని, మాతృత్వ సెలవును ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకూ ఇదే వర్తించాలన్నదే లక్ష్యం.
పిల్లల సంరక్షణకు ‘క్రెచ్‌లు’ – ఉద్యోగమే అవకాశంగా..
ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చూసుకోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. అందుకే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేట్ సంస్థల్లోనూ పిల్లల సంరక్షణ కోసం చిన్న చిన్న కేంద్రాలు అంటే క్రెచ్‌లు ఏర్పాటు చేయాలన్న యోచన ఉంది. వాటిలో పనిచేసేవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తోంది. ఇప్పుడు ప్రతి కుటుంబం ఒకరు లేదా ఇద్దరితోనే ఆగిపోతోంది. అంతకంటే ఎక్కువమంది పిల్లలు కనడమే కాదు, ఆలోచించడం లేదు. అందుకే రాష్ట్రంలో జనాభా పెరగడం కాదు, తగ్గిపోతున్నది. జనాభా పెరగకపోతే కొన్నేళ్లలో వృద్ధులే ఎక్కువైపోతారు. పని చేసే వయస్సున్న వారు తక్కువవుతారు. అప్పటికి ముందు ఆ సమస్యను ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఈ పాలసీ.
పిల్లలే భవిష్యత్తు – ప్రభుత్వం సంకల్పం..
పిల్లల సంఖ్య పెరిగేలా చేయడమే ఈ పాలసీ ఉద్దేశ్యం. మూడో బిడ్డకు తలొగ్గేలా కాకుండా, గౌరవంతో మద్దతిచ్చేలా పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఆ మేరకు కుటుంబ పోషణకు అవసరమైన మద్దతు ఇచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బలంగా చేస్తుంది. అందుకోసమే ఇప్పుడు జనాభా నిర్వహణ డ్రాఫ్ట్ పాలసీని తయారు చేస్తుంది. అందులో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తోంది. పిల్లలు అధికమైతే చదివించడం ఎలా? వారిని పెంచడం ఎలా.? వారిని పోషించడం ఎలా? అన్నది ప్రధానంగా అనేకమంది తల్లులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. దానికి సొల్యూషన్‌గా పాలసీలో పరిష్కారం మార్గాన్ని చూపనుంది ప్రభుత్వం. అదే సమయంలో వర్కింగ్ ఉమెన్‌కి కావచ్చు, మిగతా పనిచేసే మహిళలకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల పట్ల కూడా నిశితంగా పాలసీలో పేర్కొంటుంది ప్రభుత్వం. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆకర్షితులయ్యేలా, అర్థం చేసుకునేలా ఈ పాలసీ ఉండబోతుందన్నది ప్రభుత్వం చెప్తున్న మాట.