పాశమైలారం ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో సెఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించాలి, మాక్ డ్రిల్ నిర్వహించాలంటూ ఏపీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదం అంతులేని విషాదం నింపింది. బాధితుల ఆర్తనాదాలతో ఫ్యాక్టరీ ప్రాంగణం సహా హాస్పిటల్ పరిసరాలు కంటతడి పెడుతున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు దారలైపోతున్నాయి. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించాలన్నారు.
పాశమైలారం ప్రమాదంతో అటు ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ జిల్లాలో హానికర పరిశ్రమల్లో తక్షణం సేఫ్టీ కమిటీ సమావేశాలు నిర్వహించి మినిట్స్ పంపాలని ఫ్యాక్టరీలకు సూచించారు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్. ఫార్మా ఇండస్ట్రీస్ తప్పనిసరిగా పటిష్టమైన ప్రొటోకాల్స్‌తో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. మాక్ డ్రిల్ నివేదికను వెంటనే విశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు.
అత్యవసరంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్. సియాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం పదుల సంఖ్యలో కుటుంబాలను శోకసముద్రంలో ముంచేసింది. ఇలాంటి మరో ప్రమాదం జరగకుండా తెలుగు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రమాదాల నివారణకు నడుం బిగించాయి. ఇందులో భాగంగానే ఏపీ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.