ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ కూడా హాజరయింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేశారు. అటు గవర్నర్ ప్రసంగం వైసీపీ నేతల నినాదాల మధ్యే కొనసాగింది.
సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ‘పెన్షన్లు రూ. 4 వేలకు పెంచాం. ఏడాదికి రూ. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. పోలవరంను పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం’ అని గవర్నర్ తెలిపారు.
అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీరిస్తున్నామని.. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించమని గవర్నర్ అన్నారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు సమకూరేలా చూస్తామన్నారు. వ్యవసాయ, పారిశ్రమిక రంగాల అభివృద్ధికి ప్రోత్సాహిస్తున్నాం. పీఎం సూర్య ఘర్ యోజన కింద.. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు గవర్నర్.
మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గానే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై నిరసనలకు దిగారు వైసీపీ సభ్యులు. తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ అధినేత జగన్ సహా అందరూ గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలిపారు. కొద్దిసేపు నినాదాలు చేసిన అనంతరం సభ్యులంతా వాకౌట్ చేశారు. రాష్ట్రంలో ఉన్నవి రెండే పక్షాలు ఉన్నపుడు.. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు బొత్స సత్యనారనాయణ. ప్రజల సమస్యలపై గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలన్నారు. గవర్నర్ ప్రభుత్వానికే కాదు.. ప్రతిపక్షానికి కూడా అండగా నిలబడాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అధికార పక్షానికి 11మందిని ఎదుర్కొనే సత్తా లేదా అని ప్రశ్నించారు.