గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, సింగయ్య మృతికి కారణమైన జగన్ కారును అధికారులు పరిశీలించారు.
సింగయ్య మృతి కేసును కొట్టేయాలంటూ వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినీ కూడా పిటిషన్లు దాఖలు చేయడంతో అన్నింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటివరకూ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది.
మరోవైపు పల్నాడు జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ ప్రయాణించిన కారును తనిఖీ చేశారు రవాణాశాఖ అధికారులు. జగన్ కారు ఢీకొని వృద్ధుడు సింగయ్య మృతి చెందడంతో.. ఇప్పటికే కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కారు ఫిట్‌నెస్‌ను పరిశీలించారు.
జూన్ 18వ తేదీన వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో పర్యటించారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో జగన్ కాన్వాయ్ వెళుతోంది. సింగయ్య అనే వృద్దుడు ప్రమాదవశాత్తు జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ కేసును క్వాష్ చేయాలంటూ వీరంతా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
Amaravati News Navyandhra First Digital News Portal