అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడక దారిలో శ్రీవారి భక్తులను వన్యమృగాల దాడుల నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-WII, అటవీ శాఖ, TTD అధికారుల సంయుక్త కమిటీ చేసిన సిఫార్సులను నవంబరులోగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని TTD ఈవోకి హైకోర్టు స్పష్టం చేసింది.
సిఫార్సులను ఏ మేరకు అమలు చేశారో తేల్చే బాధ్యతను సంయుక్త కమిటీకి అప్పగిస్తామని చెప్పింది. మరోవైపు చిరుత దాడిలో మరణించిన చిన్నారి తల్లిదండ్రులకు మరో 15 లక్షల రూపాయల పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని TTDకి సూచించింది. తదుపరి విచారణను డిసెంబరు 24కు వాయిదా వేసింది.
వన్యప్రాణుల దాడుల నుంచి భక్తులను కాపాడేందుకు అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో.. ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, TTD, అటవీ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ 2023లో హైకోర్టులో పిల్ దాఖలైంది. TTD తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నడక మార్గంలోకి వన్యప్రాణులు ప్రవేశించేందుకు అవకాశం ఉన్న చోట్ల కంచె ఏర్పాటు చేశామన్నారు.
వాదనల అనంతరం తిరుమల నడకదారి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాలని.. ధర్మాసనం సూచించింది. అలిపిరి నడకమార్గంలో.. ఇరువైపులా ఇనుపకంచె ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది నవంబర్‌లోగా అమలు చేయాలని హైకోర్టు టీటీడీ, అటవీ శాఖను ఆదేశించింది.
Amaravati News Navyandhra First Digital News Portal