ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ విధానంలో కీలకమైన మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు ఒకే సమయానికి, కొన్ని రోజుల వ్యవధిలో మాత్రమే సరుకులు ఇచ్చే విధానం అమలులో ఉండగా, త్వరలోనే నెల మొత్తం ఎప్పుడైనా రేషన్ తీసుకునే సౌకర్యం లభించనుంది. తెనాలి మండలంలోని నందివెలుగు గ్రామంలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ నిర్ణయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.
ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం ప్రధానంగా ఇస్తున్నారు. త్వరలో కందిపప్పు, నూనె, రాగులు, గోధుమ పిండి కూడా త్వరలోనే కార్డుదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద కుటుంబాల ఖర్చు తగ్గే అవకాశం ఉంది. పేదలకు ఇంకో సంతోషకర వార్త ఏంటి అంటే.. గతంలో నెల మొదటి పక్షంలో మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పూర్తి నెలలో ఎప్పుడైనా సరుకులు పొందే వెసులుబాటు కలిగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇప్పటికే ఇంటివద్దకే డోర్ డెలివరీ కొనసాగుతోంది.
వైసీపీ పాలనలో రేషన్ సరఫరా వ్యవస్థ సరిగా పని చేయలేదని విమర్శించిన నాదెండ్ల మనోహర్.. ప్రస్తుత కూటమి పేదల కోసం కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ‘సూపర్ సిక్స్’ హామీలను వెనక్కు తగ్గకుండా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.