రాష్ట్ర సచివాలయం అప్పుడే ప్రారంభమైంది. సచివాలయానికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ సీట్ల కూర్చొని విధులు నిర్వర్తించడం మొదలు పెట్టారు. సచివాలయంలోని ఒక శాఖలో పనిచేస్తున్నా మహిళా ఉద్యోగికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు అరవింద్ అని సిఐడి నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగిలో కంగారు మొదలైంది. అరవింద్ అంతటితో ఆగకుండా మీపై సిఐడి కేసు ఉందని దాన్ని మాఫి చేయాలంటే డబ్బులివ్వాలని అడిగాడు. సిఐడి కేసు ఉందని చెప్పడంతో ఆ మహిళా ఉద్యోగిలో భయాందోళన మరింత ఎక్కువైంది. వెంటనే అరవింద్ ఫోన్ కాల్ కి ఆమె రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టింది. ఇదే అదునుగా భావించిన వ్యక్తి లక్ష రూపాయలు ఇవ్వాలంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తన ఫోన్ పే నుండి డబ్బులు చెల్లించడం మొదలు పెట్టింది. మొత్తం ఎనభై వేల రూపాయలను ఫోన్ పే ద్వారా చెల్లించింది. అప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి కాల్ కట్ చేశాడు. అయితే ఆమె కంగారులో డబ్బులు చెల్లించిన తర్వాత ఈ విషయాన్ని తోటి ఉద్యోగులకు చెప్పింది. అయితే సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసినట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గతంలో సిబిఐ పేరుతో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు రూట్ మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిఐడి రాష్ట్ర పరిధిలో ఉంటుందని దీంతో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సిఐడి పేరుతో ఫోన్ చేస్తే త్వరగా బురిడీ కొట్టించవచ్చన్న ఉద్ధేశంతో సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు అర్ధవుతుందని పోలీసులు చెప్పారు. మహిళా ఉద్యోగి బ్యాంక్ ఖాతా డిటైల్స్ తీసుకొన్న పోలీసులు ఏ ఏ ఖాతాలకు ఈ మొత్తం ట్రాన్స్ ఫర్ అయిుందో వివరాలు సేకరిస్తున్నారు.
గతంలో ఉత్తర భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇటువంటి కాల్స్ వచ్చేవని ప్రస్తుతం కొంతమంది మన రాష్ట్రం నుండి కూడా ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అలెర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని పోలీసులు చెప్పారు. మరిన్ని కాల్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్నప్తి చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal