ఆంధ్రప్రదేశ్లోని స్మార్ట్ రేషన్ కార్డులలో పేర్లు, వివరాలలో తప్పులు ఉన్నాయని తేలింది. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 30 వరకు సవరణలకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సచివాలయాల్లో సరిచేసుకోవచ్చు. తప్పుల ను సరిదిద్దుకోవడానికి గడువును ప్రభుత్వం నిర్దేశించింది.
గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేషన్ కార్డుల సందడి నెలకొంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. దీంతో చాలా మంది లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులు పొందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత రేషన్ విధానాన్ని తొలగింది, కొత్త రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త విధానంలో భాగంగా రేషన్ కార్డుల కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త స్మార్ట్ కార్డులు మంజూరు చేసింది.
అయితే ఇటీవల రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో 80 శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు రావడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డుల్లో వివరాలు తప్పుగా వచ్చిన కుటుంబాలు.. వెంటనే దరఖాస్తు చేసుకుని సవరణ చేయించుకోవచ్చని తెలిపింది. అయితే అక్టోబర్ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల్లో కొందరి పేర్లు, వివరాలు తప్పుగా వచ్చాయి. అక్షర దోషాలు, ఇతర తప్పులు రావడంతో రేషన్ కార్డుదారులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. తమ పేర్లు, వయసు, ఇంటి నెంబర్లు స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పుగా ముద్రించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు ప్రభుత్వం దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయి మార్పులకు అవకాశం కల్పించింది. స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ రేషన్ కార్డుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కార్డు యజమానులు సంబంధిత సచివాలయాల్లోకి వెళ్లి అక్కడ అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే అక్టోబర్ 30వ తేదీ వరకు గడువు విధించడంతో ఆ లోపు మార్పులు, చేర్పులకు ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.