ఆంధ్రాను వర్షాలు వీడటం లేదు. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు .. తుఫాన్లతో రైతులు ఆగమవుతున్నారు. తాజాగా మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది.
హిందూ మహాసముద్రం, దాని పక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇకపోతే శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ, ఈ నెల 12 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ అభివృద్ధి చెందుతున్న వాతావరణ నమూనా ఫలితంగా, నవంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రాంతం తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక శనివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Amaravati News Navyandhra First Digital News Portal