ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. వీటికి సంబంధించిన పలు కేసులు హైకోర్టులో ఉన్నందున.. అన్ని పోస్టుల నియామకాలు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో హైకోర్టు వీటిపై తీర్పు వెలువరించాకే ఈ పరీక్షల తుది ఫలితాలు వెల్లడిస్తామని..
రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డీవైఈఓ, లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఇంకా వెలువడలేదు. వీటికి సంబంధించిన పలు కేసులు హైకోర్టులో ఉన్నందున.. అన్ని పోస్టుల నియామకాలు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో హైకోర్టు వీటిపై తీర్పు వెలువరించాకే ఈ పరీక్షల తుది ఫలితాలు వెల్లడిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి పి రాజాబాబు వెల్లడించారు. తమ వైపు నుంచి మొత్తం ప్రకియ్రను పూర్తి చేశామని, హైకోర్టు తీర్పు రాగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫలితాలను వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు, డిప్యూటీ ఈఓ, ఎఫ్‌ఆర్వో పరీక్షల ఫలితాలు కూడా కోర్టు వివాదాల కారణగా ఆలస్యమవుతున్నట్లు ఆయన తెలిపారు.
కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి స్పోర్ట్స్ కోటా విషయంలో ఇప్పటికే హైకోర్టులో వివాదం నడుస్తుంది. ఇక గ్రూప్ 2 పోస్టుల రిజర్వేషన్ అంశం.. డీవైఈఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల ఫలితాలకు కూడా అడ్డంకిగా మారింది. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) ఫలితాలపై కూడా హైకోర్టు స్టే విధించింది. వీటన్నింటికితోడు మహిళా హారిజాంటల్ రిజర్వేషన్‌కు సంబంధించి వివాదం కూడా కోర్టులో నడుస్తోంది. ఈ పోస్టులన్నింటికీ హైకోర్టు తీర్పుతో మోక్షం కలగనుంది.
దీంతో పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరుద్యోగ అభ్యర్ధులు కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. ఇటీవల చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాలు మాత్రమే ఏ అడ్డంకి లేకుండా సాఫీగా జరిగిపోతున్నాయి. సోమవారం నుంచి ఈ పోస్టులకు సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. మొత్తం 900 మందికి ఈ దఫా పోస్టులు దక్కనున్నాయి. వీళ్లలోనూ ఎవరైనా అనర్హులుగా తేలితే మెరిట్‌లోని తదుపరి అభ్యర్ధులకు మూడో దఫాలో అవకాశం ఇస్తామని ఇప్పటికే డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.