ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే తాజాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. రాత పరీక్షను సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలో అంటే పెన్, పేపర్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్), మెయిన్స్ ఎగ్జామినేషన్, నడక / మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 5, 2025వ తేదీతో దరఖాస్తులు ముగుస్తాయి. జనరల్ అభ్యర్ధులు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 కలిపి మొత్తం 330 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత తదితరులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.250 మాత్రమే చెల్లించాలి. వీరికి ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది. స్ట్రీ, పురుష అభ్యర్థులు ఎవరైనా పోటీ పడవచ్చు. అయితే పురుష అభ్యర్ధులు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలు కనీసం 150 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు కలుస్తాయి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.