ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు 1:2 నిష్పత్తిలో సుమారు 182 మంది ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఎంపిక జాబితాను త్వరలో ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్ ప్రాతిపదికన ఉన్న స్పోర్ట్స్ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ కమిటీ పంపించే నివేదిక ఆధారంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు కనీసం వారం వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇక గ్రూప్ 1 తుది జాబితా వెల్లడించిన ఒకటి, రెండు వారాలకు గ్రూప్ 2 ఉద్యోగాలకు సైతం ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ రూపొందించింది. గ్రూప్ 1 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో సుమారు 30 మంది అభ్యర్ధులు గ్రూప్ 2 ఉద్యోగాల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కూ హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ 1లో ఖాళీలు పూరించిన తర్వాతనే గ్రూప్ 2కి సంబంధించిన తుది జాబితా వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అభ్యర్ధులు ఎవరికీ నష్టం జరగకుండా ఉంటుందని, పోస్టులు మిగిలిపోయే పరిస్థితికి కూడా తలెత్తదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ తాజా నిర్ణయం తీసుకుంది.
కాగా మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2023లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్యూ అనంతరం అభ్యర్ధుల మార్కులతో కూడిన మెరిట్ లిస్ట్‌ను కమిషన్ విడుదల చేసిన అనంతరం కమిషన్ నియామక పత్రాలు అందజేయనుంది. ఆ వెనువెంటనే గ్రూప్ 2 నియామకాలు కూడా పూర్తి చేయనుంది. మొత్తం 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇటీవల ధ్రువపత్రాల పరిశీలన పూర్తైంది. స్పోర్ట్స్ కోటాతో సహా మొత్తం 2,517 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.